Maruti Wagon R Bio Flex Fuel: భారత ఆటోమోబైల్ మార్కెట్లో ప్రస్తుతం ‘ఫ్లెక్స్ ఫ్యూయల్’ (Flex-Fuel) కార్లపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఇంధన వాడకాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. త్వరలోనే దేశంలో 100 శాతం ఇథనాల్ ఇంధనం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఒక అడుగు ముందుకు వేసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ నుండి 85శాతం ఇథనాల్ మిశ్రమం వరకు ఎలాంటి ఇంధనంతోనైనా నడిచేలా రూపొందించిన సరికొత్త ‘వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్’ కారును మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఈ కారు ధరపై ఇన్నాళ్లు చాలా మంది ఎదురుచూశారు. ఈ కారు ధర ఎంతంటే?
మారుతీ సుజుకీ ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ ప్రారంభ ధరను రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ప్రకటించింది. ఈ కారును సాధారణ వ్యాగన్ ఆర్ లోని టాప్ ఎండ్ మోడల్ అయిన ‘జెడ్ ఎక్స్ ఐ ప్లస్’ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ పెట్రోల్ టాప్ మోడల్‌తో పోలిస్తే ఈ బయోఫ్లెక్స్ వేరియంట్ ధర దాదాపు రూ. 86,000 వరకు అధికం కావడం గమనార్హం.
ఈ సరికొత్త బయోఫ్లెక్స్ వెర్షన్‌ను మారుతీ సుజుకీ సంస్థ తొలుత కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా క్యాబ్ డ్రైవర్లు రోజుకు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారు కాబట్టి, ఇథనాల్ ఇంధనం ద్వారా వారికి నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. అయితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండింగ్ బంకులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ కారును సాధారణ ప్రజలందరికీ విక్రయించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం కమర్షియల్ మార్కెట్లో క్యాబ్ ఆపరేటర్ల కోసం మారుతీ సుజుకీ ప్రత్యేకంగా ‘వ్యాగన్ ఆర్ టూర్ H3’ మోడల్‌ను అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 5.89 లక్షల వరకు ఉంది. ఈ టూర్ H3 మోడల్‌తో పోల్చి చూస్తే ఇప్పుడు వచ్చిన సరికొత్త వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ ధర రూ. 1.35 లక్షల నుండి రూ. 2.25 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది. కానీ, టూర్ H3 లో ఉండే చిన్న 1.0 లీటర్ ఇంజిన్‌తో పోలిస్తే, బయోఫ్లెక్స్ కారులో మరింత పవర్‌ఫుల్ ఇంజిన్‌ను అందించారు.
వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ కారులో 1.2 లీటర్, కె 4 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగించారు. పెట్రోల్‌లో ఎంత ఎక్కువ శాతం ఇథనాల్ కలిపినా ఇంజిన్ పాడవకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగేలా దీని లోపలి భాగాలను ప్రత్యేకంగా మాడిఫై చేశారు.అయితే ఇంధనం మారినప్పటికీ కారు పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పు లేకుండా సాధారణ పెట్రోల్ కారు లాగే 90.9 హెచ్‌పీ పవర్‌ను, 113.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నందున, ఈ బయోఫ్లెక్స్ వెర్షన్ యొక్క ఖచ్చితమైన మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డిజైన్ పరంగా చూస్తే మాత్రం ఇది చూడటానికి మనకు రోడ్లపై కనిపించే సాధారణ వ్యాగన్ ఆర్ లాగే ఉంటుంది. కేవలం కారు వెనుక భాగంలో బయోఫ్లెక్స్ అనే బ్యాడ్జ్, అలాగే డోర్లపై ఫ్లెక్స్ ఫ్యూయెల్ అనే గ్రాఫిక్స్ డీకాల్స్ మాత్రమే దీని ప్రత్యేకతను తెలియజేస్తాయి. లోపల 7 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
















యువకుడి అదృశ్యం.. వైసీపీ 'కాపు' రాజకీయం ప్రారంభం!
Sai Krishna Missing Case: ఏపీలో ఏ చిన్న అంశం జరిగిన రాజకీయం చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం వెనుక కులం కార్డు, రాజకీయ కోణం కనిపిస్తోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. పోలీస్ కస్టడీ తరువాత ఆయన అదృశ్యం అయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కస్టడీలోనే ఘాతుకం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కస్టడీలోనే ఆయనపై దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు బాధితుడు తల్లి హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ అధికారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకోవైపు ప్రభుత్వం ఆ సీఐను విఆర్ లో పెట్టింది. ఇంతవరకు ఆ కేసు లో మిస్టరీ మాత్రం వీడడం లేదు..
* చాలా క్రిమినల్ కేసులు..
సాయి కృష్ణ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. దీనిపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీస్ కస్టడీలో ఏదైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. విచారించిన కోర్టు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం లాకభ్యత జరిగిందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
* లాకప్ డెత్ అంటూ ఆరోపణ..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు కాపు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. గాది సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. బాధిత కుటుంబం జనసేనకు అండగా నిలిచిందని… అటువంటి కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అయితే కేవలం వైసీపీ ప్రెస్ మీట్ లు పెట్టి ఆరోపణలు చేస్తోంది. బాధిత కుటుంబం తరఫున ఎటువంటి న్యాయపోరాటం చేయడం లేదు. పెద్దగా ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా లేవు. అయితే ఇదే అంశాన్ని పట్టుకొని ఇప్పుడు వైసిపి రాష్ట్రవ్యాప్తంగా కాపు రాజకీయాన్ని కాక రేపాలని చూస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో దీనిపైన ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా కాపుల్లో రగడ సృష్టించేందుకేనని అర్థమవుతోంది. మరోవైపు పోలీసులు మాత్రం సాయి కృష్ణ తమ అదుపులో లేడని చెబుతున్నారు. దీంతో ఆయన అదృశ్యం మిస్టరీ వీడడం లేదు.