Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారా? జనసేన తరఫున పదవీయోగ్యం రానుందా? ఈ మేరకు అధినేత పవన్ డిసైడ్ అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు నెలల కిందట వైసీపీ నుంచి జనసేన లో బాలినేని చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేసిన బాలినేని..అధినేతతో విభేదించి జనసేనలో చేరారు. అయితే చేరిన నాటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. అయితే జనసేనలో ఆయన చేరికను ఒక వర్గం వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. స్థానిక టిడిపి ఎమ్మెల్యే సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు టాక్ నడిచింది. బాలినేని జనసేనలో చేరిక ఒక గందరగోళానికి దారితీసింది. అయితే అలా క్రియేట్ చేశారని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీలో బాలినేనికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కూటమి తరుపున ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందులో బాలినేని పేరు అనౌన్స్ చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో బాలినేని శకం మళ్లీ ప్రారంభమైనట్టే. ఇప్పటికే కూటమి పార్టీల్లో బాలినేనికి సన్నిహిత నేతలు ఉన్నారు.
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థినేతగా పనిచేశారు. 1999లో తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు బాలినేని. ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బాలినేని. అప్పటినుంచి క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చారు పార్టీ తరఫున. 2014 ఎన్నికల్లో సైతం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు. జగన్ మంత్రివర్గంలో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి బాధ్యతల నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో పునరాలోచనలో పడ్డారు. తీవ్ర తర్జన భర్జన నడుమ జనసేన గూటికి చేరారు.
* ఖాళీ అయిన స్థానంలో
వైసీపీకి ఇటీవల చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. అందులో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దీంతో శాసనమండలిలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. తప్పకుండా అవి కూటమి పార్టీలకు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు సైతం ఎమ్మెల్సీ పదవులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుల పదవులకు సంబంధించి జనసేన ఒక నిర్ణయానికి వచ్చింది. జనసేనకు సంబంధించి మెగా బ్రదర్ నాగబాబుకు పదవి ఖరారు అయ్యింది. ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి ఆశావహులు సైతం అధికంగా ఉన్నారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అనూహ్యా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ జిల్లాలో బాలినేని హవా మళ్లీ మొదలుకానుంది. ఈ విషయంలో కూటమి పార్టీల నుంచి అభ్యంతరాలు ఉన్నా.. పార్టీ బలోపేతం దృష్ట్యా పవన్ స్ట్రాంగ్ గా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.