
భారతీయ జనతా పార్టీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్‌ను వాళ్లు (బీజేపీ) అల్లర్లతో మంటబెట్టాలని చూస్తున్నట్టు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. యూనివర్శిటీలు, జేఎన్‌యూ వంటి విద్యా సంస్థలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. బెంగాల్‌పై దుష్ప్రచారం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ‘రాజకీయంగా నన్ను టార్గెట్ చేశారు. అభిజిత్ బెనర్జీ కావచ్చు, అమర్త్యసేన్ కావచ్చు, వాళ్లంతా సమాజంలో వివిధ స్థాయిల్లో ఉన్నారు. మన విద్యావేత్తలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లు (బీజేపీ) దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇన్నేళ్లూ ఒక్కసారి కూడా నేతాజీ (సుభాష్ చంద్రబోస్) గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు’ అంటూ మమత ఎద్దేవా చేశారు.