PM Vishwakarma Yojana: దేశంలో వెనుకబడిన కుల వృత్తుల అభివృద్ధి కోసం కేంద్రం నూతనగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. దేశంలోని కుల వృత్తుల వారికి వ్యాపారాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. 2023, సెప్టెంబర్ 17 దీనిని ప్రారంభించారు ఢిల్లీ లోని యశోభూమిలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
18 వర్గాలకు ప్రయోజనం..
పీఎం విశ్వకర్మ యోజన కింద 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. దీనిద్వారా ఐదేళ్లలో 30 లక్షల మంది చేతివృత్తుల వారికి రూ.13 వేల కోట్లు రుణసాయం అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు ఎలాంటి పూచీకత్తు లేదు. రూ.3 లక్షల వరకు వ్యావస్థాపక/వ్యాపారాభివృద్ధి రుణం అందిస్తారు. మొదటి విడతలో రూ.లక్ష ఇస్తారు. దానిని 18 నెలల్లో తిరిగి చెల్లించాలి. తర్వాత రూ.2 లక్షల రుణం ఇస్తారు. దానిని 30 నెలల్లో తిరిగి చెల్లించాలి. ఇక వడ్డీ రేటు కేవలం 5 శాతం మాత్రమే. మిగిలిన 8 శాతం వడ్డీని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది.
లబ్ధిదారులకు శిక్షణ..
18 రకాల కుల వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తక్కువ వడ్డీతోపాటు ఎంపిక చేసిన లబ్ధిదారులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. 5 నుంచి 7 రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారికి నైపుణ్యం ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు కూడా ఇస్తారు.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్..
పీఎం విశ్వకర్మ యోజన 2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 10,456 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో 2,543, కరీంనగర్ జిల్లాలో 2,526, సిరిసిల్ల జిల్లాలో 3,524, పెద్దపల్లి జిల్లాలో 1,863 దరఖాస్తులు వచ్చాయి.