HomeతెలంగాణDrought In Telangana: కమ్మేస్తోన్న కరువు.. ఎండుతున్న పంటలు

Drought In Telangana: కమ్మేస్తోన్న కరువు.. ఎండుతున్న పంటలు

Drought In Telangana: కరువు కమ్ముకొస్తోంది. పంట పొలాలు బీళ్లు వారుతున్నాయి. సాగునీరు అందక కళ్ల ముందే ఎండుతున్న పంటలతో రైతుల దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. గతేడాది మాదిరిగా ఈ యాసంగిలో కూడా పంటలు పండించుకోవచ్చని భావించిన రైతులకు ఈయాసంగి కష్టాలు, నష్టాలే మిగిలే అవకావం కనిపిస్తోంది. కరీంనగర్‌ జిల్లాలో కరువు విళయతాండవం చేస్తోంది. కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందుతుందని ఆశించిన 12 గ్రామాల రైతుల వరి పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సుమారు 10 వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది.

సాగునీటి కోసం..
ఇటీవలే అధికారులను కలిసిన రైతులు ఎస్సారెస్సీ డీబీఎం 22ఏ, 22బీ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోరినా ఫలితం లేదు. కొందరు బావుల్లో పూడిక తీయించే పనుల్లో నిమగ్నం కాగా, మరికొందరు బోర్లు వేయించేందుకు అప్పులు చేస్తున్నారు. యాసంగి ఆరంభంలో తెగుళ్లు పంటలపై దాడి చేయగా ఇప్పుడు పొట్ట దశలో ఉన్న పంటలకు నీరందక ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మళ్లీ పల్లెలకు బోరు యంత్రాలు..
దాదాపు ఐదేళ్లుగా బోర్లకు గిరాకీ తగ్గింది. మంచి వర్షాలు కురవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలతో చెరువలను ముందే నింపడంతో సాగునీటితోపాటు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. దీంతో బోర్లు, బావులు తవ్వకాలు ఆగిపోయాయి. బోరు యంత్రాలు పట్టణాల్లో ఇళ్లకు బోర్లు వేసే పనులు మాత్రమే చేశాయి. అయితే ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. ఆగస్టు తర్వాత వానలు కురవలేదు. దీంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీరు ఇంకిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు మళ్లీ బోరు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. బావులు తవ్వేవారిని పిలిపిస్తున్నారు.

గతంలో వారబంధీ..
గతంలో వారబంధీ పద్ధతిలో పంటలకు కాలువల ద్వారా నీరు వదిలేవారు. కానీ ఇప్పుడు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీతోపాటు మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, ఎల్లంపల్లి జలాశయాల్లో నీటిమట్టం పడిపోయింది. మరోవైపు కాళేశ్వరం ఖాళీ అయింది. నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. దీంతో కాలువల నీళ్లులేక బోసిపోతున్నాయి.

తాగునీటికీ తిప్పలే..
మూడేళ్లుగా కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడంతో గోదావరి ఏడాది పొడవునా సజీవంగా కనిపించింది. సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో భూగర్భ జలాలు పైకొచ్చాయి. తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ప్రస్తుతం గోదావరి ఎడారిని తలపిస్తోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతున్నాయి. మరోవైపు తాగునీటికి కూడా తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచినీళ్ల కోసం ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular