కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేంద్రం.. కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది.
భారత ఔషధ నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగం కింద రెండు కరోనా వ్యాక్సిన్లకు నేడు అనుమతి ఇచ్చింది. కొవిషీల్డ్.. కొవాగ్జిన్ రెండింటిలో ఏ వ్యాక్సిన్ తెలంగాణకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
భారత్ బయోటెక్ కేంద్రం హైదరాబాద్లోనే ఉండటంతో ఆ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ టీకానే తెలంగాణకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ టీకా కోరితే అదే ఇచ్చేందుకు కేంద్రం సముఖంగా ఉందనే టాక్ విన్పిస్తోంది.
కేంద్రం మార్గదర్శకాల మేరకు వైద్య ఆరోగ్య సిబ్బంది టీకాల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం చకచక నిర్ణయాలు తీసుకుంటుండటంతో రాష్ట్రానికి కరోనా టీకా మరో వారం లేదా పదిరోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది.
తెలంగాణలో ఏ తేదిన టీకా ఇస్తారనేది స్పష్టత లేకున్నప్పటికీ అనుమతి వచ్చిన 24గంటల్లోనే పంపిణీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 80లక్షల మందికి కరోనా టీకాను నాలుగు దశల్లో ఇవ్వనున్నారని సమాచారం.
కరోనా వ్యాక్సిన్ తొలి దశలో భాగంగా మొదటగా ఐదు లక్షల మందికి కరోనా టీకా వేయనున్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లుగా పని చేసిన వైద్యులు.. హెల్త్ కేర్ సిబ్బంది.. మున్సిపల్ కార్మికులు.. పోలీసులు తదితరులకు తొలి విడుతలో టీకా వేయనున్నారు.