
రాజుల కుటుంబం అంటే.. లైఫ్ ఎంత రాయల్‌గా ఉంటుందో అందరం ఊహించగలం. కళ్లు జిగేల్‌మనే సౌలతులు.. కాళ్లు కింద పెట్టాల్సిన పనిలేకుండా పనివాళ్లు.. పూటకొక వెరైటీ ఫుడ్.. మరి అలాంటి రాజభోగం అనుభవిస్తున్న వీరు కేవలం తమ భార్యల కోసం ఆ భోగభాగ్యాలను వదులుకున్నారు. తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని బయట సామాన్య జనం వలే జీవితం గడుపుతున్నారు. ఇటీవల ప్రిన్స్ హ్యారీ ఉదంతం చూశాం. ఆయన ఒక్కడే కాదు.. తమ ప్రేమను బతికించుకోవడం కోసం భోగభాగ్యాలను తృణప్రాయంగా వదిలేసిన కొందరు రాకుమారులు/రాకుమార్తెలు ఉన్నారు. వాళ్లలో హ్యారీ కుటుంబీకులూ ఉన్నాయి. వారిలో కొందరి గురించి తెలుసుకుంటే..
*పిల్లల కోసం ప్రిన్స్ హ్యారీ
ప్రిన్స్ హ్యారీ.. బ్రిటిష్ రాజవంశంలో జన్మించిన రాజకుమారుడు అతను. ఆయన వివాహం చేసుకోవాలనుకుంటే ప్రపంచంలోని ఎన్నో రాజ కుటుంబాలు.. సంపన్న కుటుంబాలు సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ.. ఆయన అమెరికన్ మోడల్, నటి మేఘన్ మార్కెల్‌ను ఇష్టపడి మరీ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో రాజకుటుంబంలో అడుగుపెట్టిన మేఘన్‌కు నిరాశే ఎదురైంది. రాజభోగాలు అనుభవిస్తున్నా.. అంతఃపుర ఆంక్షలు, నిబంధనల మధ్య ఇమడలేకపోయింది. దాదాపు అలాంటి అనుభవాలే ప్రిన్స్ హ్యారీకి ఎదురయ్యాయి. దీంతో గతేడాది రాజ్యాన్ని.. రాచరికాన్ని వదిలేసి.. సామాన్య వ్యక్తుల్లా అమెరికాలో స్థిరపడ్డారు. తాజాగా.. ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ మాట్లాడుతూ.. తను ప్రేమించే భార్య, బిడ్డల భవిష్యత్ కోసంబయటకు వచ్చానని చెప్పారు.
*కింగ్ ఎడ్వర్డ్ VIII
యునైటెడ్ కింగ్‌డమ్ చక్రవర్తి కింగ్ జార్జ్ v, క్వీన్ మేరీకి 1894 జూన్‌లో 23న కింగ్ ఎడ్వర్డ్ VIII పుట్టాడు. పెద్ద కొడుకైన ఎడ్వర్డ్ వారసత్వంగా 1936 జనవరి 20న బ్రిటీష్ రాజ్యానికి చక్రవర్తిగా సింహాసనం అధిష్టించాడు. అదే సమయంలో ఎడ్వర్డ్ అమెరికా అమెరికా పౌరులైన వాలీస్ సిమ్సన్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని అదే విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పాడు. అయితే.. ఎడ్వర్డ్ ప్రతిపాదనను రాజకుటుంబంతోపాటు అనేక వర్గాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే వాలీస్ సిమ్సన్‌కు అప్పటికే రెండు సార్లు పెళ్లి అయింది. విడాకులు తీసుకుంది. అలాంటి విడాకులు తీసుకున్న మహిళను వివాహం చేసుకోవడానికి పెద్దలు అనుమతించలేదు. ఆమెను వదిలేయాలని రాజకుటుంబీకులు ఆదేశించారు. వదిలేసే ప్రసక్తే లేదని.. ఆమెనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టారు. ఒకవేళ సిమ్సన్‌ను వివాహం చేసుకుంటే సింహాసనంపై కూర్చునే అర్హత ఉండదని రాజకుటుంబం స్పష్టం చేసింది. దీంతో ఎడ్వర్డ్.. మహారాజు స్థానాన్ని వదలుకునేందుకు సైతం సిద్ధపడ్డారు. చక్రవర్తి అయి ఏడాది కూడా కాకముందే 1936 డిసెంబరులో రాజభోగాలు, డ్యూక్ ఆఫ్ విండ్సర్ టైటిల్‌ను వదిలేశాడు. సాధారణ వ్యక్తిగా మారి సిమ్సన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ సోదరుడు జార్జ్ VI బ్రిటన్‌కు రాజయ్యాడు. ఆయన కుమార్తె ప్రస్తుత బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II.
*ప్రిన్స్ ఫిలివ్
ప్రస్తుత బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ II భర్త.. ప్రిన్స్ హ్యారీ తాత అయిన ప్రిన్స్ ఫిలిప్ కూడా ఎలిజబెత్‌ను పెళ్లి చేసుకోవడం కోసం తన రాజ్యాన్ని వదులుకున్నాడు. ఫిలిప్ గ్రీన్.. డెన్మార్క్ చక్రవర్తి ప్రిన్స్ ఆండ్రూ.. ప్రిన్సెస్ అలీస్‌కు జన్మించాడు. ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాల్లో చదువుకున్న ఫిలిప్ 1939లో రాయల్ నేవీలో చేరాడు. అతడి పనితీరును మెచ్చిన జార్జ్ VI తన కుమార్తె ఎలిజబెత్ IIను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. అయితే.. ఆమెను లగ్గం చేసుకోవాలంటే ఫిలిప్ బ్రిటన్ పౌరుడిగా మారాలి. అందుకే.. ఆయన తన గ్రీస్, డెన్మార్క్ రాచరిక వారసత్వాన్ని వదులుకున్నాడు. 1947లో ఎలిజబెత్ IIను పెళ్లి చేసుకొని రాయల్ కుటుంబంలో చేరి ఎలిజబెత్‌కు భర్త అయ్యారు. ఆయనకు నైట్ ఆఫ్ ది గార్డర్, బారాన్ గ్రీన్‌విచ్, ఎర్ల్ ఆఫ్ మెరియనెత్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ టైటిల్స్ ఇచ్చారు.
*సాధారణ జర్నలిస్టు కోసం కార్ల్ జోహన్ బెర్నాడోట్
స్వీడన్ చక్రవర్తి కింగ్ గుస్తఫ్ VI అడాల్ఫ్ నాలుగో సంతానమైన కార్ల్ జోహన్.. జర్నలిస్తున్న పనిచేస్తున్న ఒక సాధారణ యువతి ఎలిన్ కెర్స్‌టిన్ మార్గరెటాను ప్రేమించాడు. వీరి ప్రేమను రాజకుటుంబం అంగీకరించలేదు. దీంతో 1946లో కార్ల్.. రాజకుమారుడి హోదా, వారసత్వ హక్కులను వదులుకొని బయటకు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు న్యూయార్క్‌లో ఓ ట్రేడింగ్ కంపెనీలో పనిచేశారు. అయితే.. 1987లో కెర్స్‌టిన్ మరణించడంతో మరుసటి ఏడాది స్వీడన్‌కు చెందిన గున్నిలా మార్టా లూయిస్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.
*ప్రిన్స్ ఫ్రిసో
ప్రిన్స్ ఫ్రిసో నెదర్లాండ్స్ చక్రవర్తి కింగ్ విలియమ్–అలెగ్జాండర్ సోదరుడు. డచ్ రాయల్ కుటుంబంలో మెంబర్. ఆయన 2004లో సామాన్య మహిళ. మానవ హక్కుల కార్యకర్త మాబెల్ విస్సే స్మిత్‌ను వివాహమాడాడు. దీంతో రాజ్య చట్టాల ప్రకారం స్థాయికి తగ్గ మహిళను వివాహం చేసుకోనందుకు ఆయనను రాజకుటుంబం నుంచి వేరే చేసేశారు. ప్రేమ కోసం ఆయన రాజ్య వారసత్వ హక్కులను వదులుకొని సాధారణ జీవితం మొదలుపెట్టారు. అయితే.. 2012లో ఆస్ట్రియాలోని లెచ్ వద్ద స్కీయింగ్ చేస్తుండగా.. హిమపాతంలో ఆయన ఇరుక్కుపోయారు. మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లారు. 2013 ఆగస్టు 12న మరణించారు.
*జపాన్‌లో యువరాణులు
జపాన్ చక్రవర్తి హిరోహిటో కుమార్తె 1952లో పాడిరైతు టాకామసా ఇక్డాను ప్రేమ పెళ్లి చేసుకుంది. రాజకుటుంబీకులు సామాన్య వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే.. వారు కుటుంబంలో స్థానం కోల్పోతారు. వారసత్వంగా ఎలాంటి హక్కులు, ఆస్తులు పొందలేరు. దీంతో అత్సుకో రాజకుటుంబాన్ని వీడాల్సి వచ్చింది. అలాగే.. జపాన్ ప్రస్తుత చక్రవర్తి అకిహిట్–రాణి మిచికో ఏకైక కుమార్తె సయాకో. ఆమె సోదరుడు పుమిహిటో ప్రస్తుతం యువరాజుగా ఉన్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన ఆమె.. తండ్రి వారసత్వంలో భాగం కావాల్సిన సమయంలో ఓ సాధారణ ఉద్యోగి.. అర్బన్ ప్లానర్ అయిన యోషిని కురోడాని లవ్ చేసింది. వారి ప్రేమకు పెద్దలు అభ్యంతరం చెప్పారు. దీంతో ఒక రాకుమారి.. తమ స్థాయి కాని వ్యక్తిని వివాహం చేసుకోవడం తగదన్నారు. దీంతో 2005లో సయాకో తన రాజకుటుంబాన్ని.. యువరాణి హోదాను వదిలేసి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది.
*పేరెంట్స్ ఒప్పుకొని పెళ్లి చేసినా..
జపాన్‌లోని మరో రాజకుటుంబంలోనూ ప్రేమ వివాహం ఆనవాళ్లు ఉన్నాయి. రాజకుమారుడు నోరిహిటో–హిసాకో దంపతుల గారాల పట్టి అయాకో షిప్పింగ్ కంపెనీలో పనిచేసే కె మోరియాను ప్రేమించింది. దీనికి వారి పేరెంట్స్ మొదట ఒప్పుకున్నారు. దీంతో 2018లో అంగరంగవైభవంగా వారిద్దరికి వివాహం జరిపించారు. అయితే.. ఇతర రాజకుటుంబీకులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. అయాకోను బహిష్కరించాలని బలవంతం చేశారు. దీంతో ఆమె కుటుంబాన్ని వదిలి బయటకు రావాల్సి వచ్చింది.
*మేనత్తలాగే.. రాజకుమారి మేకో
ప్రేమ కోసం రాజ్యాన్ని వదిలేసుకున్న జపాన్ రాకుమారి సయాకో మేనకోడలు.. ప్రస్తుత యువరాజు పుమిహిటో కుమార్తె మేకో కూడా ప్రేమ వివాహమే చేసుకోబోతోంది. ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ విద్యార్థి కే కొమురోను మేకో లవ్ చేసింది. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించారు. 2017లో నిశ్చితార్థం కూడా చేశారు. అయితే.. రాజ చట్టాల ప్రాకం వివాహమైన తర్వాత మేకో రాజకుటుంబంలో స్థానం కోల్పోవాల్సి ఉంటుందట.
*తండ్రిని ఎదిరించిన బోల్‌రత్నా రాజకన్యా
థాయ్‌లాండ్ చక్రవర్తి భూమిబోల్ అదుల్యదేజ్ కుమార్తె అయిన బోల్‌రత్నా రాజకన్యా 1972లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న రోజుల్లో పీటర్ లాడ్ జెన్సెన్‌కు మనసిచ్చింది. ఆయనతోనే జీవితం పంచుకోవాలని ఆశపడింది. అదే విషయం తండ్రికి చెప్పగా.. ఆయన ఒప్పుకోలేదు. దీంతో కుటుంబసభ్యులను కాదని బోల్‌రత్నా పీటర్‌ను పెళ్లి చేసుకుంది. ఆగ్రహించిన తండ్రి.. ఆమెను రాజకుటుంబం నుంచి బహిష్కరించారు. దీంతో ఆమె తన వారసత్వ హక్కులను వదులుకొని అమెరికాకు వచ్చేసింది. అయితే.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో మనస్పర్థలు రావడంతో 1998లో పీటర్‌కు విడాకులు ఇచ్చింది.