దేశంలో చలి‘పులి’ పంజా విసురుతోంది. చలికాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో ఉదయం పూట జనాలు బయటికి రావాలంటనే బెంబేలెత్తిపోతున్నారు.
ఉదయం పది గంటల వరకు కూడా మంచుతెరలు తొలగించడం లేదు. దీంతో వృద్ధులు.. చిన్నారులు.. వాహనదారులు.. అస్తమా రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా చాలాచోట్ల వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఎనిమిది డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు గజగజ వణుకుతున్నారు.
ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలతో తెలుగు రాష్టాలు వణికిపోతున్నాయి. మరో రెండ్రోజులపాటు చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఐదు. మెదక్‌లో ఆరు.. హైదరాబాద్‌లో తొమ్మిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు మంగళవారం ఉదయం నమోదయ్యాయి. రాత్రిపూట సైతం సాధారణం కంటే ఎనిమది డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ నగరాన్ని కొద్దిరోజులుగా చలి వణికిస్తోంది. దీంతో చిన్నారులు.. వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు ట్రాఫిక్స్ సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏపీలోనూ శీతలగాలులు అన్ని జిల్లాలను వణికించేస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు.. రాయలసీమలో మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
శ్రీకాకుళం.. విజయనగరం.. గోదావరి జిల్లాల్లో చలి తీవ్రంగానూ.. దక్షిణకోస్తా.. రాయలసీమలో ఓ మోస్తరుగానూ చలిగాలులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విశాఖ ఏజెన్సీలో చలిపులి విరుచుకు పడుతుంటంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.