Home2020 రౌండ్ అప్2020 రౌండప్: మోడీ హవా.. ప్రతిపక్షాలు ఢీలా!

2020 రౌండప్: మోడీ హవా.. ప్రతిపక్షాలు ఢీలా!

2020.. చెప్పుకునేందుకు సిరీస్‌ ఎంతో బాగుంది. కానీ.. ఈ 2020 ఇయర్‌‌ కాస్త ప్రపంచాన్ని ట్వంటీ ట్వంటీ ఆడేసింది. అంతేకాదు.. ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పిన ప్రజలు.. చివరి త్రైమాసికానికి వచ్చే సరికి ఈ సంవత్సరం ఎప్పుడు ముగుస్తుంది దేవుడా అని అనాల్సిన పరిస్థితి. దీనిని మొత్తంగా కోవిడ్‌ నామ సంవత్సరంగా చెప్పుకోవాల్సిందే. ఓవైపు దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభిస్తుంటే మరోవైపు రాజకీయాలు మాత్రం రంజుగా సాగాయి. ఢిల్లీ ఎన్నికలతో మొదలైన ఏడాది బిహార్‌ ఎన్నికలతో ముగిసి ప్రధాన పార్టీలకు కరోనాని మించిన రాజకీయ పాఠాలను నేర్పింది. ఇక.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం మచ్చుకైనా కనిపించలేదు. తమిళ సూపర్‌ స్టార్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానన్న ప్రకటన ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది. చివరికి పార్టీ పెట్టడం లేదని యూటర్న్ తీసుకోవడం కూడా సంచలనమైంది.

*మోడీ ఇమేజ్‌కు ఏం ఢోకా లేదు..
బ్రాండ్‌ ఇమేజీకి కేరాఫ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తన స్టైల్‌.. తన వాక్చాతుర్యంతోనే అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంటారు. విదేశాలతో సత్సంబంధాలు మెయింటెన్‌ చేస్తుంటారు. అయితే.. తన బ్రాండ్‌ ఇమేజీని కాపాడుకోవడంలో ఈ ఏడాది కూడా సక్సెస్‌ అయ్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ కరోనాను ఎదుర్కోలేక కుదేలైపోతుందన్న అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో పకడ్బందీ ప్రణాళిక రచించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కష్టకాలంలో నరేంద్ర మోదీ ప్రధాని కావడం వల్ల భారత్‌కున్న పేరు ప్రతిష్టలు పెరిగాయని దేశ ప్రజల్లో 93% అభిప్రాయపడినట్టుగా ఐఏఎన్‌ఎస్‌–సీ ఓటరు సర్వే తేల్చి చెప్పింది. దీనికితోడు దేశంలో సరైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ప్రధానికి బాగా కలిసొచ్చింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు మాత్రం ఆయనని చిక్కుల్లో పడేశాయి.

*ఎన్నికలు ఏవైనా.. బీజేపీదే హవా
ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, బిహార్‌‌ ఉప ఎన్నికల్లో ఈసారి బీజేపీ హవానే కనిపించింది. ఏడాది ప్రారంభంలో ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో మరోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయ ఢంకా మోగించింది. సీఎం కేజ్రివాల్‌కు క్రేజ్‌ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 70 స్థానాలకు గాను ఆప్‌ 62 స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. ఇక బిహార్‌లో హోరాహోరీగా సాగిన పోరాటంలో ఎన్డీయే 125 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ గట్టి పోటీయే ఇచ్చింది. 75 స్థానాలను గెలుచుకొని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించడంతో రాజకీయాల్లో యువకెరటం తేజస్వి యాదవ్‌ పేరు మారుమోగిపోయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి తమ వైపు లాక్కున్న బీజేపీకి మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఆ ఎన్నికల్లో 19 స్థానాల్లో నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఏడాది రాజ్యసభలో కూడా 12 సీట్ల బలాన్ని పెంచుకొని రాజకీయంగా శక్తిమంతంగా ఎదిగింది.

*డీలా పడిన కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి. నానాటికీ పార్టీ పరిస్థితి దినదినగండంలా మారింది. ప్రధానంగా నాయకత్వ లోపం ఆ పార్టీకి పెద్ద లోటు. కొత్త జనరేషన్‌ ఆలోచనలకు తగ్గట్టుగా వ్యూహరచన చేయలేకపోవడం కూడా మైనసే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్‌ బిహార్‌ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాలకు గాను నాలుగు సీట్లలో కాంగ్రెస్‌ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. వృద్ధతరానికి, యువతరానికి మధ్య పోరు ఉధృతం కావడంతో జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కాషాయ శిబిరంలో చేరారు. ఫలితంగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయింది.

*అప్పుడు వస్తా అన్నారు.. ఇప్పుడు రానంటున్నారు..
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు ఈ ఏడాది పండగలాంటి వార్త చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోష పడ్డారు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో తమిళనాట మార్పు తీసుకువస్తానని నినదించారు. రజనీ పార్టీ పేరు మక్కల్‌ సేవై మర్చీ (ప్రజాసేవ పార్టీ)గా రిజిస్టర్‌ చేయించుకున్నారని, ఆయన ఎన్నికల గుర్తు ఆటో అన్న ప్రచారం కూడా జరిగింది. ఇంతలోనే రక్తపోటులో తేడాలతో హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో రజనీ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జి అయిన రజనీ అభిమానులకు షాకింగ్‌ లాంటి వార్త చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. పార్టీ పెట్టడం లేదని ప్రకటించేశారు.

* ప్రముఖులను బలి తీసుకున్న కరోనా
కాంగ్రెస్‌ పార్టీలో ఆ ఇద్దరూ ట్రబుల్‌ షూటర్స్‌. ఒకరు దేశ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తే, మరొకరు తెరవెనుక మంత్రాంగాన్ని నడిపారు. కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నాయకులు ప్రణబ్‌ ముఖర్జీ, అహ్మద్‌ పటేల్‌లు ఈ ఏడాది కరోనాతో కన్ను మూశారు. ప్రణబ్‌కు ఆగస్టులో కరోనా పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆయన మెదడుకు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సెప్టెంబర్‌ 1న ప్రణబ్‌ మరణించారు. కాంగ్రెస్‌లో సోనియా అంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌ నవంబర్‌ 23న కన్ను మూశారు.

-శ్రీనివాస్.బి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version