2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనల గురించి ప్రజలు కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. మారిన నిబంధనల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి రావచ్చు.
1. జనవరి 1వ తేదీ నుంచి బ్యాంకులు చెక్కుల జారీలో మోసాలను అరికట్టేందుకు పాజిటివ్ పే సిస్టమ్ ను అమలులోకి తీసుకురానున్నాయి. పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెక్కుల ద్వారా జరిపే లావాదేవీలకు రీకన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ పాజిటివ్ పే సిస్టమ్ ను వచ్చే ఏడాది నుంచి అమలులోకి తీసుకురానుంది.
2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 1వ తేదీ నుంచి కాంటాక్ట్ లెస్ కార్డుల పరిమితిని పెంచింది. ప్రస్తుతం కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు 2,000 రూపాయలు పరిమితి ఉండగా జనవరి 1వ తేదీ నుంచి 5,000 రూపాయలు పరిమితిగా ఉంటుంది.
3. కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు సాధ్యమైతే రేపటిలోగా కార్లను కొనుగోలు చేస్తే మంచిది. జనవరి 1వ తేదీ నుంచి మహీంద్రా & మహీంద్రా, మారుతి సుజుకి, ఇతర కంపెనీలు కార్ల ధరను పెంచుతున్నట్టు ప్రకటన చేశాయి.
4. 2021 సంవత్సరం జనవరి 1 నుంచి కాలం చెల్లిన సాఫ్ట్ వేర్ తో పని చేసే ఫోన్లలో వాట్సాప్ యాప్ ను వినియోగించడం సాధ్యం కాదు. మీ ఫోన్లు కాలం చెల్లిన సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంటే ఇకపై వాట్సాప్ యాప్ ను ఉపయోగించలేరు.
5. జనవరి 1వ తేదీ నుంచి ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి మొబైల్ ఫోన్లకు కాల్ చేయాలంటే ఫోన్ నంబర్ కు ముందు 0 యాడ్ చేయాల్సి ఉంటుంది. 0 ఎంటర్ చేయకుండా కాల్ చేయడం సాధ్యం కాదు.
6. జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ కచ్చితంగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.
7. థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించి లావాదేవీలు జరిపే వాళ్లు జనవరి 1వ తేదీ నుంచి అదనంగా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.
8. గూగుల్ సంస్థ జనవరి 1వ తేదీ నుంచి గూగుల్ పే వెబ్ యాప్ ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది.
9. మ్యూచువల్ ఫండ్స్ కు చెందిన నిబంధనలు సైతం 2021 జనవరి 1 నుంచి మారనున్నాయి. ఈక్విటీలో ఇకపై 65 శాతం కాకుండా 75 శాతం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
10. జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే చిన్నవ్యాపారులు ఇకపై నెలకు ఒకసారి కాకుండా మూడు నెలలకు ఒకసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే విధంగా నిబంధనలలో మార్పులు జరిగాయి. ఇకపై చిన్నవ్యాపారులు ప్రతి 90 రోజులకు ఒకసారి జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయవచ్చు.