changing relationships : కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి.. ఇదే సమయంలో మనుషుల మనసులు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. గత దశాబ్దం కాలం నుంచి ఇప్పటివరకు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, సంబంధాలు ఎన్నో మారిపోయాయి. ఒకరినొకరు కలుసుకోవడం అటు నుంచి.. కనీసం చూసుకోవడం కూడా కరువైపోయింది. ఒకప్పుడు ఒకరి ఇళ్లల్లో మరొకరు నెలలపాటు నివాసం ఉండాల్సిన పరిస్థితి ఉంటే.. ప్రస్తుత కాలంలో పెద్ద శుభకార్యం జరిగిన కూడా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.. అయితే అప్పుడు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు మనుషుల మధ్య కమ్యూనికేషన్స్ తక్కువగా ఉండేది. దీంతో ఒకరినొకరు కలుసుకోవడానికి కష్టంగా మారేది. అయితే ఏదైనా శుభకార్యం లేదా కార్యక్రమం నిర్వహించిన సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు అంతా ఒక్కచోట చేరేవారు. ఇలా కలుసుకునేందుకే కొందరు ప్రత్యేకంగా పండుగలు నిర్వహించుకునేవారు. రోజుల తరబడి వారాల తరబడి ఒకరినొకరు చూసుకోకుండా.. కలుసుకోకుండా ఉండడంతో ఒకేసారి ఇలాంటి కార్యక్రమాల్లో కలుసుకోవడం వల్ల వారి మధ్య అనుబంధాలు మరింతగా బలపడేవి. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్న తర్వాత వారి మధ్య భావోద్వేగాలు కనిపించేవి.
ఒకప్పుడు వివాహ కార్యక్రమం కనీసం ఐదు నుంచి పది రోజులపాటు జరిగేది. దీంతో కనీసం 10 రోజులపాటు కుటుంబ సభ్యులు అంతా ఓకే ఇంట్లో గడిపేవారు. అలా వారి ఇంట్లో సందడిగా మారేది. అలాగే కొందరు తమ బంధువుల ఇళ్లలో నెలల తరబడి నివాసం ఉండేవారు. సొంత వాళ్లు కాకపోయినా మనుషుల మధ్య ప్రేమలు ఉండడంతో వారితో అనుబంధాన్ని పెంచుకునేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్స్ ద్వారా కలుసుకుంటూ ఉన్నారు. దీంతో వారి మధ్య దూరం పెరుగుతోంది. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. సొంత సోదరుడు లేదా అక్కాచెల్లెళ్లు కలుసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా మనుషుల మధ్య ద్వేషాలు పెరగడంతో తల్లిదండ్రులు, కుమారులు, కూతుర్ల మధ్య కూడా దూరం పెరిగిపోతుంది. ఫలితంగా ఎవరికి వారు కలిసి ఉంటున్నారు.
ఒకప్పుడు ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలుగా విడిపోయి ఎవరికి వారు ఉండటమే కాకుండా ఒక కుటుంబానికి మరో కుటుంబానికి మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఒకప్పుడు వారికి అనేక విధాలుగా సేవలు చేసేవారు. వారితో ప్రేమగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం వారు ఎప్పుడూ బయటకు వెళ్తారా..? అని ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఎందుకు వచ్చారు? అన్న ధోరణితో ప్రవర్తిస్తున్నారు.
ఈ విధంగా ప్రస్తుత కాలంలో చాలామంది మధ్య అనుబంధాలు, ప్రేమలు మాయమైపోయాయి. ఒకరి కంటే మరొకరిపై ద్వేషం పెంచుకొని ఎవరికి వారే ఉంటూ.. కలుసుకోవడం లేదు. ఫలితంగా నేటి తరానికి బంధాలు, బంధుత్వాల విలువలు తెలియడం లేదు.