Postal Life Insurance: పొదుపు అనేది చాలా మంచిది. మన జీవితం నీటి బుడగ లాంటిది కాబట్టి.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అనేది కచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. లేకుంటే తీవ్రమైన ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఇక బయటి మార్కెట్లో పొదుపుకు సంబంధించి ఎన్నో సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే పోస్టాఫీస్ లు కూడా ఉన్నాయి. ఈ పోస్టాఫీస్ ల పరిధిలో వివిధ పెట్టుబడి పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. వీటికి సంబంధించి పోస్టాఫీస్ లలో జీవిత బీమా పథకాలు తీసుకున్న పాలసీదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. దాని ప్రకారం పోస్టాఫీసులు ఆరు రకాల జీవిత బీమా పథకాలు ఆఫర్ చేస్తున్నాయి.
సురక్ష పేరుతో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సువిత పేరుతో కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారెంటీ, సంతోష్ పేరుతో ఎండోమెంట్ ప్లాన్, సురక్ష అనే పేరుతో జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, సుమంగల్ అనే పేరుతో యాంటిసిపేటేడ్ ఎండోమెంట్ ప్లాన్, పాల్ జీవన్ బీమా అనే పేరుతో చిల్డ్రన్ ప్లాన్ పథకాలను కేంద్రం ప్రకటించింది. అంతేకాదు ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం బోనస్ కూడా ప్రకటించింది. బోనస్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. దీనికంటే ముందు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనలకు సంబంధించి బోనస్ ప్రకటించింది. దీని ప్రకారం ఇకపై ప్రతి 1000 లైఫ్ ఇన్సూరెన్స్ కు 60 రూపాయలు బోనస్ రూపంలో పెట్టుబడిదారులకు లభిస్తుంది. పిల్లల కోసం పాలసీలతో పాటు ఎండోమెంట్ పథకాలలో ప్రతి 1,000 హామీకి 48 రూపాయలు బోనస్ గా లభిస్తుంది. యాంటిసిపెటెడ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ల పై ప్రతి 1000 రూపాయలకు 45 రూపాయలు బోనస్ గా లభిస్తుంది. కన్వెర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు, ఎండోమెంట్ ప్లాన్లకు కూడా బోనస్ లభిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా కేంద్రం టెర్మినల్ బోనస్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతి 10 వేలకు 20 టెర్మినల్ బోనస్ లభిస్తుంది. వాస్తవానికి 1884 ఫిబ్రవరి 1న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టారు. కేవలం తపాలా శాఖ ఉద్యోగుల కోసమే ఈ పథకాలను ప్రవేశపెట్టారు. 2017 తర్వాత ఈ సేవలను దేశంలోని సాధారణ ప్రజలకు తపాలా శాఖ విస్తరించింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో గుర్తింపు పొందిన కంపెనీల ఉద్యోగులు ఈ పథకాల కింద జీవిత బీమా పొందొచ్చు. ఈ బీమా వల్ల అత్యవసర సమయాల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. మెచ్యూరిటీ పూర్తయితే చేతికి దండిగా నగదు వస్తుంది. అంటే ఎలా చూసుకున్న డబుల్ ప్రాఫిట్ అన్నమాట.