Financial Plan: జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఖర్చులు పెద్దగా ఉండవు. కానీ పెళ్లయ్యాక ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు భారమవుతాయి. ఇక పిల్లలు పుట్టాక బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక అవసరాలు మరింత రెట్టింపవుతాయి. పిల్లల చదువు మన మీద పెద్ద భారమే మోపుతుంది. పెళ్లికి సిద్ధమయ్యే వేళ మనం కొన్ని నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. పెళ్లికి ముందే జీవిత భాగస్వామి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. నెలకు ఎంత సంపాదిస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంత పొదుపు చేస్తున్నారు? ఇతర అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తే అన్ని విషయాలు తెలుస్తాయి.

వివాహం వైభవంగా చేసుకోవాలని కలలు కనడం సహజం. తాహతుకు మించి ఖర్చు చేస్తే మనకే బొక్క పడుతుంది. అప్పుల భారం మరింత పెరుగుతుంది. ఉన్నంతలో ఖర్చు చేయకుండా గొప్పలకు పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పవని గుర్తించుకోవాలి. పెళ్లయిన కొత్తలో షాపింగ్స్, హనీమూన్ వంటి సరదాలకు పోతే అంతే సంగతి. వీలైనంత వరకు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. తక్కువ బడ్జెట్ లోనే అన్ని సమకూర్చుకుని అత్యవసరమైన వాటిని మాత్రమే తీర్చుకునేందుకు ప్రయత్నించాలి.

భార్యాభర్తలు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒకరి జీతంలో 25 శాతం, మరొకరి వేతనంలో 50 శాతం వరకు పొదుపు చేయడమే ఉత్తమం. దీంతో భవిష్యత్ పై మనకు భయం ఉండదు. గర్భం దాల్చితే ఆడవారు కొన్నాళ్లు ఉద్యోగానికి విరామం ఇస్తారు. తరువాత పిల్లల పెంపకం, వారి చదువులు, ఇలా అనేక ఖర్చులు మనల్ని వెంటాడతాయి. ఇవన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లికి ముందే మనం జాగ్రత్తలు తీసుకుని వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
వచ్చే మూడేళ్లలో వచ్చే ఇబ్బందులేంటి? పదేళ్ల తరువాత మనకు వచ్చే ఖర్చులేంటి? అనే విషయాలను గమనించి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే సరి. మన ఆదాయ వ్యయాలపై లెక్కలు వేసుకోవడం ఎంతో మంచిది. ఇలా ఆదాయ వ్యయాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మన బడ్జెట్ మించిపోయేందుకు తప్పులు చేయకుండా ఉండటమే మంచిది.