Homeక్రీడలుIndia vs Bangladesh: ఉమ్రాన్‌ ఇన్‌.. కుల్దీప్‌ ఔట్‌.. షెహబాజ్‌ డౌట్‌.. బంగ్లాతో రెండో వన్డేకు...

India vs Bangladesh: ఉమ్రాన్‌ ఇన్‌.. కుల్దీప్‌ ఔట్‌.. షెహబాజ్‌ డౌట్‌.. బంగ్లాతో రెండో వన్డేకు టీం ఇండియా రెడీ!

India vs Bangladesh: డిజాస్టర్‌గా మిగిలిన న్యూజిలాండ్‌ టూర్‌ నుంచి బంగ్లాదేశ్‌ పర్యటనతో ఉపశమనం పొందాలనుకున్న భారత క్రికెట్‌ జట్టుకు తొలి మ్యాచ్‌ నిరాశే మిగిల్చింది. ఓటమితో టూర్‌ ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగానే బుధవారం రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత జట్టు సన్నద్ధమైంది. సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డే మ్యాచ్‌ను వికెట్‌ తేడాతో కోల్పోయిన రోహిత్‌ సేన.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్‌తో ఓటమి చవిచూసిన టీమిండియా.. ఆ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. చివరి రెండు వన్డేలను గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు మెహ్‌ది హసన్‌ అసాధారణ పోరాటంతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్‌.. అదే జోరులో రెండో వన్డే గెలిచి సిరీస్‌ విజయంతో భారత్‌కు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. తొలి వన్డే ఓటమి నేపథ్యంలో ఒత్తిడి భారత జట్టుపైనే ఉంటుందని, దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బంగ్లాదేశ్‌ భావిస్తోంది. కాగా, తొలి మ్యాచ్‌ ఓటమి నేపథ్యంలో భారత జట్టు తుది జట్టులో మార్పులు చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

India vs Bangladesh
India vs Bangladesh

ఉమ్రాన్‌ ఇన్‌.. కుల్దీప్‌ ఔట్‌..
గాయంతో దూరమైన మహమ్మద్‌ షమీ స్థానంలో ఈ పర్యటనకు ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. తొలి వన్డే రోజే బంగ్లా చేరుకున్న అతను ఆ మ్యాచ్‌ సెలెక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌ మ్యాచ్‌లోనే అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అతను రాణించినా.. టీమ్‌ కాంబినేషన్‌లో భాగంగా పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్రాన్‌ మాలిక్‌ను ఆడించాలనుకుంటే కుల్దీప్‌ బెంచ్‌కు పరిమితమవుతాడు. లేదు అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ఉమ్రాన్‌కు నిరాశ తప్పదు. అయితే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసే ఉమ్రాన్‌ మాలిక్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సిరాజ్‌ సారథ్యంలో..
మహమ్మద్‌ సిరాజ్‌ సారథ్యంలో ఉమ్రాన్‌ మాలిక్, శార్దూల్‌ ఠాకూర్, దీపక్‌ చాహర్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. తొలి మ్యాచ్‌లో సిరాజ్‌ అద్భుత ప్రదర్శనతో మూడు కీలక వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన పేస్‌ ఆల్‌రౌండర్లు దీపక్‌ చాహర్, శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో అదరగొట్టారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనై బంగ్లాదేశ్‌ ఆఖరి వికెట్‌ తీయలేక ఓటమి చవిచూశారు. దీపక్, శార్దూల్‌ లోయరార్డర్‌లో బ్యాటింగ్‌ ఝళిపించాల్సి ఉంది. డెత్‌ ఓవర్లలో కూడా క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయాలి.

India vs Bangladesh
India vs Bangladesh

షెహ్‌బాజ్‌ డౌట్‌..
రాకరాక వచ్చిన అవకాశాన్ని షెహ్‌బాజ్‌ అహ్మద్‌ వినియోగించుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో తొలి వన్డేకు దూరమైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. రెండో వన్డేకు కోలుకుంటే షెహ్‌బాజ్‌ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది. అక్షర్‌ కోలుకోకపోతే మాత్రం షెహ్‌బాజ్‌ మరో అవకాశం దక్కుతుంది. మరో స్పిన్‌∙ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ సుందర్‌ స్థానానికి ఢోకా లేదు. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై ఈ ఇద్దరు కీలకం కానున్నారు. సుందర్‌ బ్యాట్‌ మెరిపించాల్సిన అవసరం ఉంది.

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్‌..
తొలి వన్డేలో బ్యాటర్లు దారుణంగా విఫలమైనా.. మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ ఆడటం ఖాయం. ఈ ఇద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించాల్సి ఉంది. స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరిగిన విరాట్‌ కోహ్లీ ఫస్ట్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడు. అతను సైతం చెలరేగాల్సి ఉంది. నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్‌.రాహుల్‌ ఆడటం ఖాయం. తొలి వన్డేలో రాణించిన రాహుల్‌ ఆ ఫామ్‌ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆరో స్థానంలో సుందర్‌ ఆడనుండగా.. దీపక్‌ చాహర్‌తో తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది.

భారత తుది జట్టు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌(కీపర్‌), అక్షర్‌ పటేల్‌/షెహ్‌బాజ్‌ అహ్మద్, వాషింగ్టన్‌ సుందర్, శార్దూల్‌ ఠాకూర్, దీపక్‌ చాహర్, మహమ్మద్‌ సిరాజ్, ఉమ్రాన్‌ మాలిక్‌/కుల్దీప్‌ సేన్‌.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular