Credit Card Alert: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. మొబైల్ లేకుండా ఏ పని చేసే అవకాశం లేదు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల సైతం మొబైల్ తోనే తమ పనులను నిర్వహించుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో మొబైల్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కొందరు తెలుపుతున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మొబైల్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మాయం చేస్తున్నారు. ఇప్పటికే రకరకాలుగా బ్యాంకు వినియోగదారుల డబ్బులను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.. ఎప్పటికప్పుడు కొత్త రకంగా వినియోగదారులను మభ్యపెడుతూ.. వారి నుంచి డబ్బులను లాగేసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది.. ఆ తర్వాత కొన్ని వివరాలు చెప్పడంతో వెంటనే.. బ్యాంకు నుంచి రూ.41,000 మాయమయ్యాయి. అసలేం జరిగిందంటే?
Also Read: క్రెడిట్ కార్డ్ కంటే డెబిట్ కార్డు బెటర్.. ఎందుకంటే?
జగిత్యాల పట్టణానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తికి ఇటీవల ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికే తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డుకు సంబంధించిన లిమిట్ పెంచుతామని ఫోన్లో పేర్కొన్నారు. దీంతో ఇది బ్యాంకు వారి ఫోన్ కాల్ అనుకొని.. సుధాకర్ తన వివరాలను చెప్పాడు. దీంతో అటువైపు నుంచి ఒక యాప్ను పంపించారు. దీనిని ఓపెన్ చేసి వివరాలు అందించాలని తెలిపారు. ఆ వ్యక్తి యాప్ ఓపెన్ చేసి తనకు సంబంధించిన వివరాలను ఎంట్రీ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి రూ 41,000 బ్యాంకు నుంచి కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే సుధాకర్ వద్ద ఆర్బి ఎల్ అనే క్రెడిట్ కార్డు ఉండేది. దీనికి సంబంధించిన లిమిట్ పెంచుతామని ఫోన్ వచ్చింది. దీంతో ఇది నిజమేనని సుధాకర్ నమ్మాడు. దీనిపై అతడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇలా సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసం చేసే అవకాశం ఉంది. అందువల్ల వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో తమ వివరాలను వెల్లడించకుండా ఉండాలని బ్యాంకు నిపుణులు తెలుపుతున్నారు. క్రెడిట్ కార్డుకు సంబంధించి లిమిట్ పెంచడం లేదా.. ఇతర అవసరాల కోసం ఆన్లైన్లో ఎప్పుడు వివరాలు అందించకూడదని ఇప్పటికే ఫలితాలు సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నా.. లేదా బ్యాంకుకు సంబంధించి అప్డేట్ కావాలని అనుకున్నా.. నేరుగా కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలియని వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం లేదా.. బ్యాంకుకు సంబంధించిన వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా?
ఒకవేళ అనుకోకుండా బ్యాంకు నుంచి డబ్బులు మాయం అయినట్లు మెసేజ్ వస్తే.. వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే ఆలస్యమైతే ట్రేస్ చేయడం కష్టంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అంతకుముందు ఫోన్ మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.