Kothagudem: మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. అసలు ప్రేమానురాగాలు అన్నీ పోయి పగ ప్రతీకారాలు వచ్చేస్తాయి.. కట్టుకున్న భార్యను గదిలో నిర్బంధించి తిండి పెట్టకుండా హింసించి చంపిన ఓ భర్త వ్యవహారం తాజాగా అందరికీ షాకింగ్ గా మారింది.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
కొత్తగూడెం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (33) దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుతో ఆమెకు 2015లో వివాహం జరిగింది. వివాహం అనంతరం కొంతకాలం సవ్యంగా సాగిన దాంపత్య జీవితం గత మూడు సంవత్సరాలుగా అశ్వారావుపేటలో కొనసాగింది.
అయితే, శనివారం రోజున లక్ష్మీప్రసన్న మెట్లపై నుండి కిందపడి గాయపడిందని నరేష్ బాబు తన అత్తమామలకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. ఆ వెంటనే ఆసుపత్రికి చేరుకున్న లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తమ కూతురు పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారు. ఎముకలు విరిగిపోవడంతోపాటు శరీరమంతా కొత్తగాయాలు, పాతగాయాల ఆనవాళ్లు కనిపించడంతో అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై అనుమానస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ “గత రెండేళ్లుగా మా కూతురిని గదిలో నిర్బంధించి, కనీసం మమ్మల్ని కూడా చూడనివ్వలేదు. అదనపు కట్నం కోసమే మా కూతురిని వేధించి చివరికి హతమార్చారు” అని ఆరోపించారు.
ఈ సంఘటనతో విశ్వన్నాథపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకునే ప్రక్రియలో ఉన్నారు.
కట్నం పేరుతో జరిగే ఇలాంటి ఘటనలు సమాజంలో ఇంకా కొనసాగుతున్నాయనడానికి ఇది మరొక ఉదాహరణ.