
Dhoni : మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న క్రికెటర్. వికెట్ కీపర్ గా అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఆడుతున్న ధోనిని చూసేందుకు వేలాది మంది అభిమానులు వస్తున్నారు. అభిమానుల ఆశలను ఏమాత్రం వమ్ము చేయకుండా.. వికెట్లు వెనకాల.. బ్యాటింగ్ లోను అధరగొడుతున్నాడు ధోనీ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో మహేంద్రసింగ్ ధోని సరికొత్తగా కనిపిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కీ తనలోని పాత ధోనీని బయటపెడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. లేటెస్ట్ గా తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. గత కొంతకాలం నుంచి ధోని గురించి అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలతో ధోనీకి ఈ ఐపీఎల్ ప్రత్యేకం కావడానికి కారణంగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ను నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఈసారి ఐదోసారి తన జట్టుకు టైటిల్ అందించే లక్ష్యంతో ఉన్నాడు.
ప్రదర్శనతో అదరగొడుతున్న చెన్నై జట్టు..
ఈసారి చెన్నై జట్టుకు కప్ అందించాలన్న కసితో ఉన్న ధోని.. అందుకు అనుగుణంగానే అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నాడు. తాజాగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది చెన్నై జట్టు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన చెన్నై.. నాలుగు మ్యాచ్ లు నెగ్గింది. దీంతో ఎనిమిది పాయింట్లతో పాయింట్లు పట్టికలో మూడు స్థానంలో నిలిచింది చెన్నై జట్టు. రాబోయే మ్యాచ్ ల్లో కూడా ఇదే ప్రదర్శన చేస్తే.. చెన్నై జట్టుకు తిరుగుండదు.
పాత ధోనీని బయటపెడుతున్న కెప్టెన్..
క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో మహేంద్రసింగ్ ధోని ఇటు బ్యాట్ తో, అటు వికెట్లు వెనుక అదరగొట్టేవాడు. వయసు పైబడుతుండడంతో కొన్నాళ్లుగా ప్రదర్శనలో వాడి తగ్గింది. అయితే తాజా ఐపీఎల్ లో మాత్రం ధోని సరికొత్తగా కనిపిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కి తనలోని పాత ధోనీని బయట పెడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో బ్యాటింగ్ తోను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తను వికెట్ కీపింగ్ స్కిల్స్ తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ధోని. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ధోని తన పేరిట ఐపీఎల్ లో అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వికెట్ కీపింగ్ చేస్తూ 200 మంది ఆటగాళ్లను అవుట్ చేసిన తొలి వికెట్ కీపర్ గా ధోని నిలిచాడు. ఇందులో క్యాచ్ లు, స్టంపింగులు, రన్ అవుట్ లు ఉన్నాయి. ఓవరాల్ టి20 కేరీర్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. 208 క్యాచ్ లతో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ ను అధిగమించాడు. దినేష్ కార్తీక్ (205), కమ్రాన్ అక్(172), దినేష్ రామ్ దిన్ (150) తరువాత స్థానాల్లో ఉన్నారు.
ధోని వేగం చూసి థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్..
ధోని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. ఐపీఎల్ లో అత్యధిక వయసున్న ఆటగాడు ధోనీనే. అయితే వయసు అన్నది అంకె మాత్రమేనని.. తనలోని ఆటకు, సత్తాకు అది ఏ మాత్రం అడ్డంకి కాదని ధోని నిరూపిస్తున్నాడు. ఈ వయసులో కూడా ధోని వేగం చూసి ఫాన్స్ ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేంద్రసింగ్ ధోనీ టీమ్ ఇండియాకి ఇంకా ఆడితే బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు. నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ.. ఈ సీజన్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ధోనీలో ఉన్న స్పీడ్ చూస్తుంటే మరో మూడు, నాలుగు ఏళ్ళు ఐపీఎల్ దర్జాగా ఆడవచ్చు అని అభిమానుల పేర్కొంటున్నారు. చూడాలి మరి ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఏది ఏమైనా ఐపీఎల్ చరిత్రలో ధోని సృష్టించిన ఈ రికార్డు.. అద్భుతం అనే చెప్పాలి అని అభిమానులు పేర్కొంటున్నారు.