Homeఆంధ్రప్రదేశ్‌YCP : వైసీపీలో నాయకులకు కరువైన స్వేచ్ఛ

YCP : వైసీపీలో నాయకులకు కరువైన స్వేచ్ఛ

YCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఏ అంశంపై ఎవరు మాట్లాడాలనే స్పష్టత లేదు. నాయకులు ఎవరికి వారే అన్న చందంగా ఉండడంతో ఇప్పుడు సమస్య ఉత్పన్నమవుతోంది. తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలను జనాల్లోకి వెళ్లేలా తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న నాయకులు సైలెంట్ అయిపోవడంతో వైసీపీ ఇరకాటంలో పడుతోందనే విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశంలో సాధారణంగానే అధినేతలకు తప్ప మరో నాయకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అయితే కొన్ని విషయాలపై కొంత మంది మాట్లాడేలా పార్టీలు ముందుగానే కొంతమంది వ్యక్తులను నిర్ణయించి బాధ్యతలను అప్పగిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఒక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. అధికార పార్టీపై ఒక్కో రంగంలో చేసే విమర్శలకు ఒక్కో కీలక నాయకుడిని బరిలో దించుతోంది.

కౌంటర్ చేయడంలో విఫలమవుతున్న వైసిపి..

తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలను తిప్పి కొట్టడంలో వైసిపి విఫలమవుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని వంటి నేతలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే విమర్శలను బలంగా తిప్పుకొట్టేవారు. అయితే వారి స్థాయిలో ఇప్పుడు ఎవరు ప్రతిపక్షాలు చేసే విమర్శలను కౌంటర్ చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పార్టీ నుంచి వారికి సరైన మార్గదర్శనం లేకపోవడమే అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడప్పుడు తప్ప కొడాలి నాని, పేర్ని నాని మీడియా ముందుకు రావడం లేదు. ఆళ్ల నాని అయితే అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

పార్టీ నుంచి సమాధానం చెప్పే వారేరీ..

ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శలను కొందరు నాయకులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి ఇస్తున్న కౌంటర్లు ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఇకపోతే పార్టీ పరంగా ఈ తరహా విమర్శలను బలంగా తిప్పికొట్టే నాయకులకు ఆస్కారం లేకుండా పోయింది వైసీపీలో. పార్టీ నుంచి అధికారికంగా మాట్లాడే వ్యక్తులు కూడా ఎవరూ కనిపించడం లేదు. ఒకప్పుడు బలంగా పార్టీ వాయిస్ ని వినిపించిన ఎంతో మంది నాయకులు.. ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఈ విషయంలో వైసీపీ మరింత దృష్టి సారించకపోతే భవిష్యత్తులో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో నాయకులకు తగిన స్వేచ్ఛ లేకపోవడం వలన.. ఎవరు ముందుకు రాలేకపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది.

చురకలు అంటించే నేర్పరతనం కావాలి..

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు నేరుగా రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో బదులిచ్చేవారు. యనమల రామకృష్ణుడు వంటి నేతలు చేసే విమర్శలకు.. నాటి ఆర్థిక మంత్రి కొనిజేటి రోశయ్య లాంటి వారి చేత సమాధానం చెప్పించేవారు రాజశేఖర్ రెడ్డి. చేసే విమర్శకు.. తమదైన శైలిలో చురకలు అంటిస్తూ సమాధానాలు చెప్పడం వలన ప్రజల్లోకి వేగంగా వెళ్లే అవకాశం ఏర్పడేది అప్పట్లో. అయితే ప్రస్తుతం అటువంటి నేర్పరతనం ఇరు పార్టీల్లోనూ కొరవడిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బూతులు, తిట్ల దండకాలతో విమర్శలు చేయడం కంటే.. హుందాతనంతో విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకోవడం మంచిదన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది.

సెల్ఫీ చాలెంజ్ కరెక్టే.. తిప్పికొట్టే సామర్థ్యం లేదిక్కడ..

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ పేరుతో..ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై సరికొత్తగా విమర్శలు చేస్తున్నారు. గతంలో తాము నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి.. ఇది మేము చేసిన అభివృద్ధి అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే, దీనిపై వైసీపీ ప్రతిగా విమర్శలు చేస్తోంది తప్ప.. దాన్ని కౌంటర్ చేయలేకపోతోంది. అదే బిల్డింగ్ వద్దకు వెళ్లి.. చంద్రబాబు నాయుడు కట్టించిన ఈ భవనం.. లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని.. ఒకవేళ అప్పుడే నిర్మాణం జరిగితే, లబ్ధిదారులకు పంపిణీ చేసి ఉంటే.. ఇళ్లల్లో లబ్ధిదారులు ఉండాలి కదా..! మరి లేరు ఏంటి అంటూ కౌంటర్ చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళేది. అలా చేయకుండా ఏవో విమర్శలు చేయడం వలన ఉపయోగం ఉండదు అన్న సూచనలు వైసీపీకి వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular