
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు నెంబర్ 2. సీఎం జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ పార్టీలో ఇంకెవరి మాటకైనా ప్రాధాన్యత ఉంది అంటే అది ఒక్క విజయసాయి రెడ్డికి మాత్రమే. కొద్ది నెలల కిందటి వరకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను నిర్వర్తించింది కూడా ఆయనే. తనకిచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంలో విజయసాయి రెడ్డికి సాటి మరొకరు ఉండరు. ఇటువంటి విజయసాయిరెడ్డి కొద్ది రోజుల నుంచి సైలెంట్ అయిపోయారు. విజయసాయి మౌనం దాల్చడం వెనుకున్న కారణాలు ఏమిటి..? అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు వైసీపీ శ్రేణులను వేధిస్తోంది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటు విజయసాయిరెడ్డి. వైఎస్ కుటుంబానికి ఆడిటర్ గా సేవలు అందించిన విజయసాయిరెడ్డి.. అంతకు మించిన మిత్రత్వాన్ని ఆ కుటుంబంతో కొనసాగించారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2 గా అభియోగాలను ఎదుర్కొన్నారు. వైసిపి అధికారంలోకి రావడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎనలేనిది. అయితే, విజయసాయి రెడ్డి పాత్ర కొట్టిపారేయలేనదని ఆ పార్టీ శ్రేణులు చెబుతుంటారు. అటువంటి విజయసాయిరెడ్డి కొద్దిరోజుల నుంచి మౌనం దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమై ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు. దీనికి గల కారణాలు ఏమిటన్న చర్చ ఆ పార్టీలోనే సాగుతోంది.
ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగించడంతో కినుకు..
వైసీపీ అధికారంలోకి రావడానికి ముందు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డి చూసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలను కొనసాగించింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని ఏ అధికారి ఏ పని చేయాలన్నా విజయసాయిరెడ్డి అనుమతి తప్పనిసరి అన్నంతగా ఆయన ఇక్కడ పాతుకుపోయారు. ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం కూడా చేసేవారు. నగర పరిధిలో బలహీనంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జీవీఎంసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిందంటే దానికి విజయసాయిరెడ్డి అనుసరించిన రాజకీయ వ్యూహమే కారణం అన్న విషయాన్ని ఇక్కడ శ్రేణులు నిర్మొహమాటంగా అంగీకరిస్తారు. జీవీఎంసీ పరిధిలో ఆయన కొన్నాళ్ల కిందట పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రకు వచ్చిన స్పందన ఫలితంగానే జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని అందరూ చెబుతుంటారు. పార్టీలో అంతటి కీలకమైన విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాద్యతల నుంచి కొన్నాళ్లు కిందట అధిష్టానం తొలగించింది. ఆ బాధ్యతలను సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. నాటి నుంచి కినుకు వహించిన విజయసాయిరెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉండడం తగ్గించారు.
ప్రతిపక్షాలపై తగ్గిన విమర్శలు వాడి..
సిఎం జగన్మోహన్ రెడ్డిపైనా, ప్రభుత్వం పైన ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తే వాటికి ధీటుగా సమాధానం చెప్పేవారు విజయసాయిరెడ్డి. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా విమర్శలపై తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్లు ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ చేసే వ్యాఖ్యలపై.. ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో పంచులు వేస్తూ విమర్శలు గుప్పించేవారు. మా అన్న చంద్రబాబు అంటూ అనేకసార్లు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసి.. చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ కూడా విజయసాయిరెడ్డినే లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. అయితే విజయసారెడ్డి రాజకీయంగా జోరు తగ్గించడంతో తెలుగుదేశం పార్టీ కూడా విజయసాయిరెడ్డిని పట్టించుకోవడం మానేసింది.
విమర్శలకు కేంద్ర బిందువుగా మారడంతోనే..
ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. A2 కబంధ హస్తాల్లో ఉత్తరాంధ్ర చిక్కుకొని విలవిల్లాడుతోంది అంటూ టిడిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎక్కడి నుంచో వచ్చిన విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర పై పెత్తనం ఏమిటి అంటూ అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అధికారులు కూడా విజయసాయిరెడ్డి మాట మినహా.. మరో ప్రజా ప్రతినిధి మాట వినేందుకు ఇష్టపడడం లేదు అని పలువురు ఎమ్మెల్యేలు కూడా సీఎంకు ఫిర్యాదు చేసినట్లు చెబుతుంటారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నుంచి తప్పించి.. బాబాయ్ సుబ్బారెడ్డికి అప్పగించారు.
విజయసాయి ఉంటే ఎమ్మెల్సీ విజయం దక్కేదే..
ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతలు నిర్వర్తించినట్లయితే.. కొద్దిరోజులు కిందట జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధించి ఉండేదని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. సుబ్బారెడ్డి సౌమ్యంగా ఉండడం, ఇతర నాయకులపై పెత్తనం చెలాయించలేకపోవడం, అధికారులకు గట్టిగా చెప్పలేకపోవడం వంటి కారణాల వల్ల పట్టబద్రుల స్థానాన్ని వైసీపీ కోల్పోవాల్సి వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అదే విజయసాయిరెడ్డి ఉండి ఉంటే.. తనదైన శైలిలో రాజకీయ చతురత చూపించి ఎమ్మెల్సీ స్థానంలో విజయం దక్కించుకునేలా చేసే వారని చెబుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక ఆయన చేసిన కృషి దాగి ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఆధారంగా చేసుకుని ఆయనను ఉత్తరాంధ్ర బాధ్యతలు నుంచి తప్పించడం వల్ల.. పార్టీ నష్టపోయిందే తప్ప లాభం కలిగింది లేదని చెబుతున్నారు.
పార్టీ శ్రేణుల్లోనూ అంతర్మథనం..
వైసీపీలో ఒకప్పుడు బలమైన వాణి వినిపించిన విజయ్ సాయి రెడ్డి మౌనం దాల్చడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీ పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉండడం వల్లే మౌనంగా ఉంటున్నారని పలువురు చెబుతున్నారు. పార్టీ పట్ల సానుకూలంగా లేకపోయినప్పటికీ.. ప్రతిపక్షాల పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించడం పట్ల వైసీపీ శ్రేణులు కూడా అంతర్మథనం చెందుతున్నారు. తారకరత్న మృతి చెందిన సందర్భంగా చంద్రబాబు నాయుడుతో ఆత్మీయంగా మెలగడం, మొన్నటికి మొన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం, గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ పట్ల నాయకుల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేయకపోవడం వంటి అంశాలను చూస్తున్న వైసీపీ శ్రేణులు.. విజయసాయిరెడ్డి పార్టీకి దూరమవుతున్నారన్న భావనకు వస్తున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీకి దూరమైతే చాలా నష్టం చేకూరుతుందని, ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిసారించి లోపాలను సవరించుకొని ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉండడానికి విజయసాయిరెడ్డి చేసిన కృషి ఎంతో కారణం. సోషల్ మీడియా కార్యకర్తలకు సపోర్ట్ చేయడంలో విజయసాయిరెడ్డిను మించిన వ్యక్తి మరొకరు ఉండరని ఆ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఏది ఏమైనా ప్రస్తుతం విజయసాయిరెడ్డి మౌనం అనేక అనుమానాలకు కారణమవుతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నది సరిగ్గా సరిపోతుందని పలువురు పేర్కొంటున్నారు.