Pet Care: ఒంటరి ప్రపంచం.. జంతువులతో సహవాసం!

ఒంటరి తనం నుంచి బయటపడేందుకు భారతీయులు ఎక్కువగా పెంపుడు జంతువులపై ఆధారపడుతున్నారు. పెట్స్‌ కోసం భారతీయ కుటుంబాలు నెలకు కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 4:20 pm

Pet Care

Follow us on

Pet Care: జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. అన్నాడు సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ప్రస్తుతం ప్రపంచంలో మనుషుల జీవితం ఇలాగే మారుతున్నట్లు కనిపిస్తోంది. అందరూ ఉన్నా ఒంటరిగా జీవిస్తున్నారు. బంధాలు, అనుబంధాలకు దూరమవుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంతో ఏకాకి జీవితం గడుపుతున్నారు. ప్రపంచంలో ఒంటరితనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్య ముప్పుగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఒంటరితనం వీడేందుకు..
ఒంటరి తనం నుంచి బయటపడేందుకు భారతీయులు ఎక్కువగా పెంపుడు జంతువులపై ఆధారపడుతున్నారు. పెట్స్‌ కోసం భారతీయ కుటుంబాలు నెలకు కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ఖర్చు రూ.5 వేల వరకు ఉంటుందని డ్రూల్‌ పెట్‌ ఫుడ్‌ సీఈవో శశాంక్‌ సిన్హా తెలిపారు.

రూ.10 వేల కోట్లకు..
పెట్స్‌పై పెడుతున్న ఖర్చు పెరుగుతుండడంతో దేశీయ పెట్‌ కేర్‌ రంగం ప్రస్తుత విలువ రూ.5 వేల కోట్లకు చేరింది. 2028 నాటికి ఆ మొత్తం రూ.10 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌తో 31 మిలియన్ల పెట్‌ డాగ్స్, 2.44 లక్షల పెట్‌ క్యాట్స్‌తో పెంపుడు జంతువుల పాపులేషన్‌లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

యజమానుల్లా కాదు..
కన్నవారిని దూరం చేసుకుని.. తాము కన్నవారికి దూరంగా ఉంటున్న చాలా మంది పెట్స్‌తో సహజీవనం చేస్తున్నారు. పెంపుడు జంతువులను దత్తత తీసుకునే విషయంలో ధోరణి మారుతోంది. జెన్‌జెడ్, మిలీనియల్స్‌ పెంపుడు జంతువులకు తమని తాము యజమానులం అనే భావన కాకుండా తల్లిదండ్రుల్లా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పెట్స్‌ ఆహారం, గ్రూమింగ్‌తోపాటు పెట్‌ కేఫ్‌లు, పెట్‌ ఇన్సూరెన్స్‌ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు.

16 శాతం వృద్ధి..
రాబోయే ఐదారేళ్లలో పెట్‌ కేర్‌ రంగం 16 నుంచి 19 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఇంటి బయట ఉండే పెంపుడు జంతువులు ఇప్పుడు ఇంట్లోకి వచ్చేశాయి. కోవిడ్‌ కారణంగా బెడ్‌రూంలోకి ప్రవేశించాయి. కుటుంబంలో భాగస్వామయ్యాయి. జంతు ప్రేమికులు పెరిగారు. పెట్స్‌కు ఏం తినిపించాలి, ఎలాంటి ఆ హారం అందిచాలి, వాటికి అవసరమయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడగడం ప్రారంభించడం ఒంటరి మనుషులు పెట్స్‌పై చూపుతున్న ప్రేమకు నిదర్శనం.