USA Vs Bangladesh: తోక జట్టనుకుంటే.. బంగ్లా పులులనే పడుకోబెట్టింది..

హౌస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఈ విజయం అమెరికా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మరి కొద్ది రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అమెరికా జట్టు సాధించిన ఈ విజయం సంచలనంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 4:27 pm

USA Vs Bangladesh

Follow us on

USA Vs Bangladesh: క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఆట ఎలా మారుతుందో.. ఎలాంటి వైపు టర్న్ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. పైగా టీ – 20 లాంటి క్రికెట్ లో పెను సంచలనాలు నమోదవుతాయి. ఇక ఇలాంటి సంచలనాన్నే అమెరికా జట్టు నమోదు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ లో సిరీస్ లో తొలి మ్యాచ్ లో అమెరికా గెలిచింది. హౌస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఈ విజయం అమెరికా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మరి కొద్ది రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అమెరికా జట్టు సాధించిన ఈ విజయం సంచలనంగా మారింది.

ఈ మ్యాచ్లో అమెరికా టాస్ గెలిచింది. మైదానంపై స్పష్టమైన అవగాహన ఉండడంతో బౌలింగ్ వైపు మొగ్గింది. దీంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 రన్స్ చేసింది. బంగ్లా ఆటగాళ్లలో తౌహిద్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే బంగ్లాదేశ్ జట్టును అమెరికా మ్యాచ్ ప్రారంభంలోనే గట్టి దెబ్బ కొట్టింది. పవర్ ప్లే లో బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్ 14, సౌమ్య సర్కార్ 20 పరుగులు మాత్రమే చేసి పెరీయం చేరుకున్నారు. కెప్టెన్ శాంటో కూడా మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. షకీబ్ ఆల్ హసన్ ఆరు పరుగులకే వెనుతిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ 68 పరుగులకే నాలుగు క్రికెట్ నష్టపోయి, తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన మహమ్మదుల్లా 31, తౌహీద్ బంగ్లా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే బంగ్లా బ్యాటర్లు నిదానంగా ఆడటంతో భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. అమెరికా బౌలర్లలో స్టీవెన్ టేలర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యాన్ని చేదించే క్రమంలో అమెరికా 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ చేజింగ్ కు దిగిన అమెరికా ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మోనన్క్ పటేల్ 12, గౌస్ 23, స్టీవెన్ టేలర్ 28, అరోన్ జేమ్స్ 4 పరుగులు చేసి నిరాశపరిచారు కానీ ఈ దశలో వచ్చిన అండర్సన్ 34*, హర్మీత్ సింగ్ 33* పరుగులు చేసి, అమెరికాకు విజయాన్ని కట్టబెట్టారు.

ఈ విజయంతో అమెరికా జట్టులో రెట్టింపు ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. తోక జట్టు, అనామక జట్టు అని హేళన చేస్తే.. బంగ్లా పులులను పడుకోబెట్టి కోలుకోలేని షాక్ ఇచ్చింది. టి20 వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చే జట్లకు ప్రమాదకర సంకేతాలను పంపింది. మరి ఈ ఓటమితో బంగ్లాదేశ్ జట్టు తన ఆట తీరు మార్చుకుంటుందా? లేదా? అనేది మున్ముందు మ్యాచ్ లలో తేలనుంది.