జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై పూర్తి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు జరుపుతున్నారు. పనితీరు బాగా లేని వారిని పిలిపించి మరీ మాట్లాడుతున్నారు. పద్ధతి సరి చేసుకోండి.. లేకుంటే తప్పిస్తానని కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ ఇద్దరి ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు పవన్. అందులో ఒకరిని పదవికి రాజీనామా చేయాలని కూడా ఆదేశించారు. అధినేత ఆదేశాలకు కట్టుబడి ఆయన రాజీనామా కూడా చేశారు. మరో ఎమ్మెల్యే కు నాలుగు వారాల గడువు ఇచ్చారు. ఈ గడువులోగా తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను సరి చేసుకోవాలని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేలకు ఫైనల్ వార్నింగ్ ఇస్తారని.. మారకపోతే మాత్రం వదులుకునేందుకు సిద్ధమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..
* విప్ పదవిని వదులుకోమన్న పవన్
కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆయన ఇటీవల జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనపై ఓ ప్రభుత్వ మహిళ ఉద్యోగి తీవ్ర లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీధర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఆ నివేదిక వచ్చిన తరుణంలో ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. అయితే సదరు మహిళతో తనకు సంబంధం ఉన్న మాట వాస్తవమేనని.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పవన్ కళ్యాణ్ కు అరవ శ్రీధర్ సమర్పించారు. అయితే ఇక నుంచి అటువంటి ఆరోపణలు విమర్శలు రాకుండా చూసుకోవాలని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. జరిగిన డ్యామేజ్ కు విప్ పదవికి రాజీనామా చేయాలని పవన్ ఆదేశించడంతో అరవ శ్రీధర్ ఆ పని చేశారు.
* నాలుగు వారాల డెడ్ లైన్..
మరోవైపు ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై కుటుంబ పరంగా, పార్టీ పరంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తనను విడిచిపెట్టి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ స్వయంగా బాలరాజు భార్య పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీలో సీనియర్లు ఓ ఇద్దరూ బాలరాజును ప్రోత్సహించి.. జనసేన తరఫున గెలిపిస్తే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సదరు జనసేన నేతలు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని పవన్ కళ్యాణ్ కు తేల్చి చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును పిలిపించుకుని మాట్లాడారు పవన్ కళ్యాణ్. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. నాలుగు వారాల్లోగా అన్ని సమస్యలు పరిష్కరించుకొని రావాలని ఆదేశించారు. మొత్తానికి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో నేత్రం తెరిచినట్టు కనిపిస్తున్నారు.
