YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కావడంతో ఆ పార్టీ వైపు గిరిజనులు మొగ్గు చూపారు. 2014 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాలేదు కానీ.. గిరిజన ప్రాంతాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలను ఆ పార్టీ సొంతం చేసుకుంది. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. కానీ 2024లో మాత్రం ఆ పార్టీ దెబ్బతింది. దాదాపు ఎస్టి నియోజకవర్గాల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ గెలుపొందని నియోజకవర్గాల్లో సైతం మొన్నటి ఎన్నికల్లో గెలిచింది. అయితే ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటుతున్న గిరిజనుల్లో చేంజ్ కనిపించడం లేదు. గతం మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై సానుకూలత వ్యక్తం చేయడం లేదు. ఆ పార్టీకి ఇది ఆందోళన కలిగించే విషయమే.
* గిరిజన ప్రాంతాలపై పవన్ ఫోకస్..
ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. అక్కడ గిరిజనులతో మమేకమై పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గిరిజనుల్లో క్రమేపి మార్పు ప్రారంభం అయింది. ఆ పైవారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విభేదించడం ప్రారంభించారు. కూటమి పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి గిరిజనుల సానుకూలత కూటమికి దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి గిరిజనులకు హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయాలని కోరుతూ ఇప్పుడు వైసీపీ గిరిజన నేతలు పోరాట బాట పట్టేందుకు నిర్ణయించారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన గిరిజన నేతలు పీడిక రాజన్న దొర, పాముల పుష్ప శ్రీవాణి నాయకత్వంలో వైసిపి పోరాటాలు చేయాలని నిర్ణయించుకుంది.
* రిజర్వుడు నియోజకవర్గాలపై..
ఏపీలో రిజర్వుడ్ నియోజకవర్గాలు 36 ఉన్నాయి. అందులో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు 29, ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏడు. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మూడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు, ఒకటి ఎస్టీ నియోజకవర్గం ఉంది. అయితే ప్రస్తుతం ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఐదు చోట్ల కూటమి, రెండు చోట్ల వైసీపీ అధికారంలో ఉంది. అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ గెలిచింది. అయితే క్రమేపీ గిరిజనుల్లో మార్పు వస్తోంది. పవన్ అటవీ శాఖ తీసుకోవడం వెనుక గిరిజనుల అభిమానం పొందాలన్న లక్ష్యం కనిపిస్తోంది. కొండ శిఖర గ్రామాలకు సైతం మౌలిక వసతులు కల్పించారు పవన్. కొన్ని ప్రాంతాల్లో స్వరూపాన్ని మార్చారు. అందుకే గిరిజనుల్లో వైఖరి మారుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంట్ సీటును కైవసం చేసుకునేందుకు గట్టి ప్రణాళికతో ఉంది కూటమి. అయితే ఈ డేంజర్ బెల్ ను గమనించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎన్నికల్లో హామీలు అమలు చేయాలని పోరాట బాట పడుతోంది.



