Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అన్న విమర్శను మూట కట్టుకున్నారు. సీరియస్ గా రాజకీయాలు చేయలేదని ఎక్కువమంది విమర్శిస్తుంటారు. అందుకే జనసేనకు సరైన విజయం దక్కలేదని విశ్లేషిస్తుంటారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకుంది. 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కానీ పవన్ రెండు చోట్ల మాత్రమే ప్రచారం చేశారు. కానీ ఆ ఎనిమిది చోట్ల సైతం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో వ్యూహాలు లేక దెబ్బతిన్నారని… ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా చూసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అటు పార్లమెంట్ స్థానాలతో కలిపి జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలు 23. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ 21 అసెంబ్లీ స్థానాల్లో.. రెండుసార్లు పర్యటించి, రోజంతా రోడ్డు షోలు చేసి, బహిరంగ సభలు నిర్వహిస్తే విజయం సాధించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ గత అనుభవాల దృష్ట్యా పవన్ ఆ పని చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా 50 రోజులకు పైగా సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. సొంత పార్టీ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులు సైతం గెలిచే ఛాన్స్ ఉంటుంది.
అన్నింటికీ మించి పవన్ తనకు తాను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఇప్పటికే రెండు ఎన్నికలను చూశారు. పార్టీకి సరైన విజయం దక్కలేదు. తన నాయకత్వాన్ని నిరూపించుకునే మంచి ఫలితాలు చవి చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే జనసేనకు జీవన్మరణ సమస్యలాంటివి ఈ ఎన్నికలు. సరైన విజయం దక్కకుంటే పార్టీ శ్రేణుల్లోనే ఒక రకమైన అభద్రతాభావం బయటపడుతుంది. గతం మాదిరిగా జనసైనికులు పవన్ కళ్యాణ్ విశ్వసించే ఛాన్స్ ఉండదు.అటు భాగస్వామ్య పార్టీలు సైతం దూరంపెట్టే అవకాశం ఉంది. జాతీయస్థాయిలో సైతం ఒక రకమైన ముద్ర ఏర్పడుతుంది. అన్నింటికీ మించి ప్రజల్లో చులకన భావం ఏర్పడడం ఖాయం. అందుకే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. మరి అందుకు పవన్ సిద్ధపడతారా? గతంలో మాదిరిగా తేలిపోతారా? అన్నది చూడాలి.