Jagan And Vijayamma: ఏపీలో విపక్షాలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు ప్రచార సభలు నిర్వహించారు. లక్షలాదిమంది జనంతో బలప్రయోగం చేశారు. మరోవైపు ఈరోజు నుంచి మనమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపాలపాయలోని రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించి బస్సు యాత్రను ప్రారంభించారు. అయితే అక్కడ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విపక్షాల నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యింది.
గత కొద్దిరోజులుగా వైయస్ కుటుంబంలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే.వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైఎస్ కుటుంబం అడ్డగోలుగా చీలింది.మరోవైపు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ షర్మిల తెలంగాణ వైపు అడుగులు వేశారు. అప్పటికే వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. షర్మిలకు తన అవసరం ఉందని.. అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందని.. తెలంగాణలో షర్మిలకు అండగా నిలబడతానని విజయమ్మ ప్రకటించారు.అదే సమయంలో షర్మిల టిడిపి అనుకూల మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.తనతో పాటు తన తల్లిని జగన్ మోసం చేశారని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి జగన్ తల్లి,చెల్లిని తరిమేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. జగన్ పై వ్యక్తిగతంగా కామెంట్స్ చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో ఇవి విపక్షాలకు అస్త్రంగా మారాయి.తన తల్లిని, చెల్లిని జగన్ దూరం చేశారని.. పట్టించుకోవడం లేదని.. వారిని వ్యక్తిగతంగా సైతం టార్గెట్ చేస్తున్నారని రకరకాలుగా విపక్షాలు ఆరోపణలు చేస్తూ వచ్చాయి. సొంత వారిని తరిమేసిన వాడు ఈ రాష్ట్ర ప్రజలను ఏం చేస్తాడు అని విపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. అటు వివేకానంద రెడ్డి కుటుంబం సైతం ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో జగన్ కు రాజకీయంగా దెబ్బ తప్పదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలోనే జగన్ తన తల్లి విజయమ్మ సాయాన్ని అర్ధించినట్లు తెలుస్తోంది.
మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో పర్యటించడానికి జగన్ సిద్ధపడ్డారు. ఈరోజు కడప పార్లమెంటు స్థానం పరిధిలో పర్యటనను ప్రారంభించారు. ముందుగా ఇడుపాలపాయలోని రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్ధనలు చేసి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే విజయమ్మ అక్కడ ప్రత్యక్షమయ్యారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు. ఆశీర్వదించి పంపారు. గత ఎన్నికలకు ముందు కూడా జగన్ పాదయాత్ర చేసిన సమయంలో విజయమ్మ ఇదేవిధంగా ఆశీర్వదించి పంపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఒక్క అవకాశం తన కుమారుడికి ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరించడంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వైయస్ కుటుంబం విడిపోయిందని భావించిన విపక్ష నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది.