YS Vijayamma: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తల్లి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి భార్య విజయలక్ష్మి రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ ప్రక్షాళన సమయంలోనే పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవిని పొడగిస్తూ ప్రకటన చేయలేదు. ఈ సమయలోనే అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇటీవల విజయమ్మ రాజీనామా చేసినట్లు ఒక లేఖ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిని నిజం చేస్తూ విజయమ్మ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదికగా తన రాజీనామా ప్రకటించారు.
ప్లీనరీకి వస్తుందో రాదో అనే అనుమానాల నడుమ..
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు గుంటూరులో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల పార్టీ ప్రక్షాళన సమయంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రస్తావన లేదు. దీంతో నాడే విజయమ్మను పార్టీ నుంచి తప్పించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాలకు విజయమ్మ రాకపోవచ్చన్న ప్రచారం జరిగింది. కానీ అందరి అనుమానాలు నివృత్త చేసేలా విజయమ్మ ప్లీనరీకి తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లిన విజయమ్మ, జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత ఇద్దరూ ప్లీనరీకి వచ్చారు.
Also Read: Pawan Kalyan- Jagan Navaratnalu: జగన్ నవరత్నాలపై పవన్ కళ్యాణ్ ‘నవసందేహాలు’.. వైరల్
తల్లిగా ఇద్దరికీ అండగా.. పార్టీ పరంగా షర్మిల వెంట..
ప్లీనరీలో మొదట పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. తర్వాత పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, కారణాలు, పార్టీ ఏర్పాటు తర్వాత పడిన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అన్నింటిని అధిగమించేందుకు జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని తాను, తన కూతురు షర్మిల నడిపించిన తీరు, షర్మిల పాదయాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. చివరకు విజయ తీరాలకు చేరామని, అన్నివేళలా తమకు అండగా నిలిచిన ప్రజలకు జగన్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నారని వివరించారు. ఈ సందర్భం తల్లిగా తాను జగన్‌కు, షర్మిలకు ఇద్దరికీ అండగా ఉంటానన్నారు. అయితే పార్టీ పరంగా మాత్రం రెండు పార్టీల్లో సభ్యత్వం ఉండడం సబబు కాదని, విమర్శకుల నోళ్లు మూయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్‌కు అండగా నిలిచానని, ప్రస్తుతం తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తెలంగాణలో షర్మిలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. తన బిడ్డ జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి, మరోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతాడని ఆకాంక్షించారు.
వైఎస్సార్‌టీపీలో కీలక బాధ్యతలు..
వైఎస్సార్ సీసీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన విజయమ్మ ఇకపై తెలంగాణలో వైఎస్సార్ టీపీకి అధ్యక్షురాలు, తన కూతురు షర్మిలకు అండగా ఉంటానని ప్రకటించారు. పార్టీకి అన్నివిధాలా తన సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు. విజయమ్మ రాజీనామా చేస్తున్నట్ల ప్రకటించిన వెంటనే షర్మిల ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే అంతా అనుకున్నట్లుగానే జరిగిందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే షర్మిల రాజీనామాను స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేయడం ద్వారా విజయమ్మకు తన పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారన్న అ్రప్రాయం వ్యక్తమవుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:YCP Plenary : వైఎస్ఆర్ కుటుంబంలో కుదిరిన సయోధ్య.. కలిసిన జగన్, షర్మిల, సునీత