Pawan Kalyan- Jagan Navaratnalu: జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అధికార పక్షంపై పదునైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు వేళ కొత్త చర్చను లేవనెత్తారు. ప్లీనరీ వేదికగా గత మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలపై సీఎం జగన్ ప్రసంగించనున్న సమయంలోపవన్ హీట్ పెంచేలా నవరత్నాలపై నవసందేహాల పేరిట ప్రశ్నల వర్షం కురిపించారు. సందేహాలను నివ్రుత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2017 ప్లీనరీ వేదికగా జగన్ నవరత్నాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అవి ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. ప్రజలు నవరత్నాలను నమ్మి జగన్ వైపు మొగ్గుచూపారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం కట్టబెట్టారు. అయితే గత మూడేళ్లుగా నవరత్నాల్లో ప్రకటించిన పథకాలను అమలు చేస్తున్నట్టు జగన్ సర్కారు చెబుతూ వస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం చాలామంది అర్హులను వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ పక్కన పెట్టారు. పథకాలను దూరం చేశారు. మరోవైపు రాష్ట్రంలో అభివ్రుద్ధి కుంటుపడింది. సంక్షేమ పథకాల మాటున ఏపీ సర్కారు లక్షల కోట్లు అప్పులు చేసింది. కార్పొరేషన్ల పేరిట భారీగా రుణం సైతం పొందింది. భవిష్యత్ ఆదాయాన్ని సైతం కుదువు పెట్టి ఎడాపెడా అప్పలు చేసింది. అప్పులపై విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు మడత పెచీ వేస్తోంది. ఏ ప్రభుత్వం అప్పు చేయలేదని బుకాయిస్తోంది. బీజేపీపై సైతం వైసీపీ నేతలు కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? అని సైతం ప్రశ్నించిన సందర్భాలున్నాయి. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా జగన్ సర్కారు సంక్షేమ మంత్రం పఠిస్తోంది. తాజాగా వైసీపీ ప్లీనరీలో నవరత్నాలను మరింత రాటు దేల్చి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించేందుకు వ్యూహరచన చేస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో మరోసారి లబ్ధి పొందేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. నవరత్నాలపై నవ సందేహాల పేరిట ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేశారు. లోపాలను ఎత్తిచూపారు. నవరత్నాల పేరిట లబ్ధిదారుల కోత, అర్హులకు జరుగుతున్న అన్యాయంపై నేరుగా ప్రశ్నించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా వంచించిందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నవసందేహాల పేరిట పథకాల్లో కోత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గణాంకాలను ప్రస్తావిస్తూ వైసీపీ సర్కారును నిలదీసినంత పనిచేశారు.
నవరత్నాల్లో.. మొదటి రత్నంగా రైతుభరోసా పథకాన్ని చేర్చారు. 64 లక్షల మంది రైతులకు భరోసా ఇస్తున్నామని ప్రకటించిందని..కానీ 50 లక్షల మందికే ఇస్తున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. మిగతా 14 లక్షల మంది రైతులకు పథకానికి ఎందుకు దూరం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.6 వేలు కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసిన విషయం నిజం కాదా అని పవన్ ప్రశ్నించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే..700 మందిగా గణాంకాలు చూపడం రైతు సంక్షేమమా అంటూ నిలదీశారు. మిగతా 2300 మంది కౌలు రైతుల కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
Also Read: YCP Plenary : వైఎస్ఆర్ కుటుంబంలో కుదిరిన సయోధ్య.. కలిసిన జగన్, షర్మిల, సునీత
రెండో రత్నంగా పేర్కొంటున్న అమ్మ ఒడిలో కూడా తల్లులకు తీరని అన్యాయం చేశారని … ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి సాయం చేస్తామని ప్రకటించారా లేదా అని ప్రశ్నించారు. తీరా ఇంటికి ఒకరికే పరిమితం చేశారని.. దీనికి సవాలక్ష నిబంధనలతో కొర్రీలు వేసిన మాట నిజం కాదా అని నిలదీశారు. కేవలం 43 లక్షల మందికే అందించి.. మిగతా 83 లక్షల మందికి ఎందుకు మొండి చేయి చూపారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తొలి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.14 వేలు, ఇప్పుడు రూ.13 వేలు అందించారని.. ఇలా కోతతో మిగుల్చుతున్న నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కోత విధిస్తున్నామని చెబుతున్నారని.. కానీ ప్రైవేటు విద్యార్థులకు విధిస్తున్న కోత మొత్తాన్ని ఎటువైపు మరల్చారని కూడా పవన్ ఎండగట్టారు.
మూడో రత్నంగా చెబుతున్న సామాజిక పింఛన్లలో భారీగా కోత విధించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.45 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరికీ పెన్షన్ అందిస్తామని నాడు చెప్పిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అకారణంగా 5 లక్షల పింఛన్లు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలకు పింఛన్ల నుంచి ఎందుకు దూరం చేశారని ప్రశ్నించారు. రూ.3 వేలకు పింఛన్ మొత్తాన్ని పెంచుతామన్న హమీ ఎందుకు బుట్టదాఖలు చేశారని.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగో రత్నంగా చెబుతున్న మద్య నిషేధం ఊసే మరిచిపోయారని ఎద్దేవా చేశారు. నాడు అక్క చెల్లెళ్ల బతుకులను అస్తవ్యస్తం చేస్తున్న మద్యం, సారాను పారద్రోలుతానని.. అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలుచేస్తానని మాట ఇచ్చారా? లేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులను నడుపుతుందని.. ఏడాదికి 25 శాతం షాపులను తగ్గించి.. నాలుగో ఏడాదికి మద్యనిషేధం అమలుచేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టినా అటువంటి సన్నాహాలేవీ ప్రారంభం కాలేదన్నారు. 2018, 19లో రూ?14 వేల కోట్లు, 2021, 22లో రూ.22 కోట్ల ఆదాయం సమకూరిందా లేదా అని కూడా ప్రశ్నించారు.మద్యం బాండ్లపై కూడా అప్పులు తేలేదా అంటూ గట్టిగానే నిలదీశారు. ఇదేనా మద్య నిషేధమంటూ ఎద్దేవా చేశారు.
ఐదో రత్నంగా చెబుతున్న జలయగ్నంపై కూడా పదునైన అస్త్రాలు సంధించారు. మూడేళ్లవుతున్నా పోలవరానికి అతీగతీ లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా ప్రారంభించారా అని ప్రశ్నించారు. బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నా.. నిధులు మాత్రం మంజూరు కావడం లేదన్నారు. అటు నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆరో రత్నంగా పేర్కొంటున్న ఆరోగ్యశ్రీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ సేవల నుంచి కొన్ని ఆస్పత్రులు ఎందుకు తప్పుకుంటున్నాయని ప్రశ్నించారు. సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు ఎందుకు మంజూరు కావడం లేదన్నారు. వందలాది కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇదేనా పేదల వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యమంటూ నిలదీశారు.
ఏడో రత్నంగా చెబుతున్న ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో మాట తప్పిన విషయాన్ని ప్రశ్నించారు. పీజీ విద్యార్థులకు పథకం ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు సక్రమంగా చెల్లిస్తే హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ఎందుకు మొండికేస్తాయని పవన్ ప్రశ్నించారు.
ఎనిమిదో రత్నంగా చెబుతున్న ఇళ్ల నిర్మాణ పథకంపై అసలు చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో, చెరువులు, గుట్టల మధ్య ఇళ్ల పట్టాలు ఇవ్వడం భావ్యం కాదా అని ప్రశ్నించారు. అసలు ఇంటి నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
తొమ్మిదో రత్నంగా చెబుతున్న ఆసరాఅసలు మహిళలకు ఎంతవరకూ అండగా నిలిచిందని ప్రశ్నించారు. ఏటేటా మహిళా స్వయం సహాయ సంఘాలు ఎందుకు తగ్గుతున్నాయని నిలదీశారు. అభయహస్తం నిధులు 2,000 కోట్లు ఎటువెళ్లిపోయాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి నవసందేహాల పేరిట పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే దీనిపై వైసీపీ సర్కారు క్లారిటీ ఇస్తుందో? లేక వ్యక్తిగత విమర్శలతో సరిపెడుతుందో చూడాలి మరీ.
Also Read:PM Modi- Chiranjeevi: మెగాస్టార్ కు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్.. చిరంజీవి ఎందుకు తిరస్కరించారంటే?