తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టేశారు. ఇక, చేయాల్సింది తెలంగాణ మడిలో రాజకీయ సేద్యం. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత తేలిక కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలమైన శక్తిగా ఉన్న అధికార పార్టీని, జోరు చూపిస్తున్న కాంగ్రెస్, బీజేపీని తోసి రాణీ అనడానికి అవకాశాలు లేవన్నది మెజారిటీ విశ్లేషకుల అంచనా. అయితే.. షర్మిల మాత్రం దీక్షలు మొదలు పెట్టారు. మొదటి నుంచీ నిరుద్యోగులను మాత్రమే టార్గెట్ చేసిన ఆమె.. ఇప్పుడు కూడా వారి కోసమే దీక్ష చేస్తున్నానంటూ ‘మంగళవారం దీక్షలు’ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదంటూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని తాడిపత్రి గ్రామానికి చెందిన కొండల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు అతని కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. అనంతరం దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని, రాష్ట్రంలోని యువకులంతా ఈ దీక్షలో పాల్గొని, తనకు మద్దతు తెలపాలని కోరారు. అయితే.. వాస్తవంగా చూస్తే షర్మిల వెంట వచ్చిన నాయకులు ముందస్తుగా సిద్ధం చేయించుకున్న యువత తప్ప.. ఇతర ప్రాంతాల్లో దీక్షకు ఎవరూ రాలేదని తెలుస్తోంది. మరి, ఈ దీక్షలు అటు కేసీఆర్ ను, ఇటు నిరుద్యోగులను ఎంత వరకు కదిలిస్తాయన్నదే ప్రశ్న.
రాజకీయ వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ ఎంతటి దురంధరుడో ఆయన ట్రాక్ రికార్డే చెబుతుంది. ఇప్పటి వరకు బండి సంజయ్ వంటి నాయకుడు వ్యక్తిగతంగా ఎంత టార్గెట్ చేసినా.. కింది స్థాయి నేతలు సమాధానం చెప్పారే తప్ప, ఆయన స్పందించలేదు. అలాంటిది షర్మిల వ్యాఖ్యలకు స్పందించే అవకాశం బహుశా ఉండకపోవచ్చు. మరి, నిరుద్యోగ యువకులను షర్మిల దీక్షలు కదిలిస్తాయా? అన్నది చూడాలి.
ఇప్పటికే.. 50 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్. దీన్ని తన అకౌంట్లోనే వేసుకునే ప్రయత్నం చేశారు షర్మిల. తాను ఉద్యమిస్తానని చెప్పినందుకే.. ఈ నోటిఫికేషన్ వేశారని చెప్పుకొచ్చారు. ఎలాగో నోటిఫికేషన్ వేశారు కాబట్టి.. విద్యార్థులు దానిమీద కూర్చునే అవకాశమే ఎక్కువ. మరి, ప్రభుత్వంపై కొట్లాడేందుకు షర్మిలతో వాళ్లు కలిసి వస్తారా? అన్నది సందేహమే అంటున్నారు పరిశీలకులు.
అటు షర్మిల మాత్రం ప్రతీ మంగళవారం నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తానని చెప్పారు. ఆ మధ్య ఖమ్మం సభలోనూ నిరుద్యోగ, యువత సమస్యల మీదనే ఎక్కువగా మాట్లాడారు. మొత్తానికి యూత్ ను షర్మిల టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. మరి, వారి నుంచి షర్మిల పార్టీకి ఏ మేర సహకారం అందుతుంది? ఆమె పార్టీ నిలబడడానికి తెలంగాణలో ఎంత వరకు అవకాశం ఉంది? అన్నదానికి కాలకమే సమాధానం చెప్పాలి.