Assistant editor controversy : కర్మఫలం అంటుంటాం కదా.. మనం పువ్వు విసిరిస్తే పువ్వే కిందికి వస్తుంది. రాయి విసిరిస్తే అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇదే కర్మఫలం ఆ సార్ కు వర్తించింది. అంతేకాదు వాస్తవం 70mm స్క్రీన్ లో కనిపించింది. దీంతో ఇన్నాళ్లు చేసిన మూర్ఖత్వపు వ్యవహారాలు సార్ కు 4k క్వాలిటీతో కనిపిస్తున్నాయి.
తెలుగు నాట ఓ ప్రముఖ పత్రికలో ఆయన గతంలో పనిచేసేవారు. ఆయన తలతిక్క వ్యవహారాల వల్ల మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో మరో మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అత్యంత కీలకమైన స్థానంలో కూర్చున్నాడు. ఆ తర్వాత తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఎక్కడా పచ్చదనం లేని చోట గన్నేరు చెట్టే వటవృక్షమైనట్టు.. ఆ పత్రికలో మిగతా వారికి ఇతడి తరహా మయోపాయాలు తెలియకపోవడంతో.. సదరు సార్ ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది.
ఉద్యోగులను తొలగించడం.. నచ్చినవారిని నెత్తి మీద పెట్టుకోవడం.. ఇలా అతని ఆటలు సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి. మేనేజ్మెంట్ కూడా అతడు చెప్పిన దానికి తల ఊపడం మొదలుపెట్టింది. అందువల్లే అతడు ఏం చేసినా సరే చెల్లుబాటు లాగా మారిపోయింది. పనిచేసే విషయంలో తాబేలు మాదిరిగా.. సోషల్ మీడియాలో కుందేలు మాదిరిగా వ్యవహరించడం ఆయనకు అలవాటు.
తిక్క తిక్క పోస్టులు పెట్టడం.. గెలికి వాసన చూసుకోవడం సదరు సార్ కు ఒక అలవాటు. సోషల్ మీడియాలో తన పైత్యాన్ని నిత్యం ప్రదర్శిస్తూనే ఉంటారు. తను చెప్పింది మాత్రమే వేదమని వాదిస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. ఇలానే తిక్క తిక్కగా మాట్లాడితే.. బడిత పూజ చేయడానికి తెలంగాణ వాదులు ఆయన పని చేస్తున్న కార్యాలయానికి వచ్చారు.. అప్పుడు పోలీసులు ఆయనకు రక్షణ కల్పిస్తే బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు. అలాంటి తిక్క సార్ గారి తిక్క ఇన్నాళ్లకు కుదిరింది.
సదరు సార్ పనిచేస్తున్న పత్రిక కార్యాలయంలో ఇటీవల ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మేనేజింగ్ డైరెక్టర్ కోడలు హాజరయ్యారు. కొన్ని సంవత్సరాలుగా పత్రిక సంబంధించిన ఫైనాన్స్ వ్యవహారాలు మొత్తం ఆమె చూస్తున్నారు. ఇటీవల సదరు సార్ సోషల్ మీడియా వ్యవహారం ఆమెకు తెలిసింది. బోర్డు మీటింగ్లో సాక్షాలతో మొత్తం వాటిని ఆమె ప్రొజెక్టర్ సహాయంతో చూపించింది. “ఇంకోసారి మీరు సామాజిక మాధ్యమాలలో ఇలాంటి లేకి పోస్టులు పెడితే బాగోదని” హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు ఉంటూ.. పత్రిక వ్యవహారాలలో తక్కువ సమయం గడపడం సరికాదని హెచ్చరించింది. దీంతో ఆ సార్ కు వాస్తవం బోధపడింది. చివరికి అన్ని మూసుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా వాడటం లేదు. ఫోన్ కూడా ఉపయోగించడం లేదు. జస్ట్ తెలిసిన కాల్స్ మాత్రమే అప్పుడప్పుడు ఎత్తుతున్నారు. దీనినే కర్మఫలం అంటుంటారని ఆయన బాధితులు చెబుతున్నారు.