ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా నిజాయితీగల పోలీస్ అధికారితో విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరులో ఆయన కారుకు ప్రమాదం జరిగినప్పటి నుంచి.. ఆసుపత్రిలో మరణం దాకా సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేశారు.
‘‘అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా మంద కృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘‘మహేష్ కత్తి మృతిపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతో చాలా మంది శత్రువులు తయారయ్యారని గతంలో జరిగిన సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. యాక్సిడెంట్ మొదలు ఆసుపత్రిలో ఆయన మరణం వరకు మధ్యలో 15 రోజుల్లో ఏం జరిగిందనే విషయమై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి లేదా సిట్టిం్ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని అన్నారు.
ఇంకా.. మందకృష్ణ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగిందని, అది కూడా డ్రైవింగ్ సీటు వైపు కాకుండా.. మహేష్ ఉన్నవైపే జరిగిందని అన్నారు. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డాడని చెప్పారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి.. వైద్యం కొనసాగుతున్నంత వరకు తాను సమాచారం తెలుసుకుంటూనే ఉన్నట్టు చెప్పారు. అయితే.. మహేష్ ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని, ఒక కన్ను మాత్రం తీసేయాల్సి వస్తుందని వైద్యులు చెప్పారని.. మూడునాలుగు రోజుల్లో డిశ్చార్జి కూడా చేస్తామని తెలిపారని మందకృష్ణ చెప్పారు.
అలాంటిది.. ఉన్నట్టుండి చనిపోయినట్టు ప్రకటించారని అన్నారు. కేవలం ఐదు నిమిషా ముందు సీరియస్ గా ఉందని, ఆ వెంటనే మరణించారని చెప్పారని మందకృష్ణ అన్నారు. అందువల్ల ఆసుపత్రిలో మహేష్ కు అందించిన చికిత్స వివరాలు వెల్లడించాలని డిమండ్ చేశారు. అదేవిధంగా.. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని అన్నారు.
ఇక, తాము పరివర్తన (మార్పు) కోరుకునే మనుషులమే తప్ప.. ప్రతీకారం తీర్చుకునే వారము కాదని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని మందకృష్ణ చెప్పారు. కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు, కామెంట్లను చూస్తే.. ఆయన చనిపోవాలని ఎంతగా కోరుకున్నారనో అర్థమవుతోందని అన్నారు. ఇవన్నీ చూసినప్పుడు.. కత్తి మహేష్ ను చంపడానికి ఎవరైనా ప్లాన్ చేశారా? అనే సందేహం కలుగుతోందన్నారు. వీటిని ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు.