Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Lands: అమరావతిలో అస్మదీయులకు భూసంతర్పణ.. వైసీపీ ప్లాన్..!

Amaravati Lands: అమరావతిలో అస్మదీయులకు భూసంతర్పణ.. వైసీపీ ప్లాన్..!

Amaravati Lands
Amaravati Lands

Amaravati Lands: ప్రజా రాజధాని నిర్మించేందుకు సమీకరించిన అమరావతిలోని వేల ఎకరాల భూములను అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. వేలాది ఎకరాలను వైసీపీ కార్యకర్తలకు అప్పగించే ఎత్తుగడలకు ప్రభుత్వ పెద్దలు దిగుతున్నారు. అమరావతి భూముల విషయంలో వైసీపీ అగ్రనాయకత్వం ఎత్తుగడ ఏమిటో ఒకసారి చూద్దాం.

2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు అమరావతిని రాజధానిగా వైసిపి నాయకులు అంగీకరించారు. సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని, తాను అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ప్లేటు ఫిరాయించింది.

Amaravati Lands
Amaravati Lands

అమరావతి రాజధాని కాదు అని అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని, అక్కడికి వెళ్ళిపోబోతున్నామని సంకేతాలు ఇచ్చారు. అందుకు అనుగుణంగానే గడిచిన నాలుగేళ్లలో అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులను నిలిపేశారు. కొత్తగా ఒక్క ఇటుక కూడా ఇక్కడ పేర్చలేదు. దీంతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పెట్టారు. నాలుగేళ్లుగా దీక్షలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట అమరావతి టు అరసవల్లి పాదయాత్రను చేపట్టారు. ఒకపక్క అమరావతి రాజధాని కోసం రైతుల పోరాటం సాగిస్తుంటే, మరో పక్క ఆ రైతుల భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆర్ -5 జోన్లుగా విభజన..

అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమిని మాత్రం అప్పణంగా పేదల పేరుతో పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడానికి ఆర్ 5 జోన్లు లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమని.. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని.. నిలబడవని తెలిసి కూడా ఉత్తర్వులు జారీ చేసేశారు. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్ 5 జోన్ గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో కూడా మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్ -5 జోన్ పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి 15 రోజులు గడువు ఇచ్చింది.

ప్రభుత్వ చర్యలను తప్పు పట్టిన హైకోర్టు..

ఈ వ్యవహారంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందే ప్రభుత్వ చర్యలను హైకోర్టు తప్పు పట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లడం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది. సిఆర్డిఏ చట్టంలో ఎలాంటి మార్పులు చేయకూడదు అన్న కోర్టు తీర్పు ఉన్నప్పటికీ సిఆర్డిఏ చట్టంలో సవరణలు చేసింది ప్రభుత్వం. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సిఆర్డిఏ కు, ప్రభుత్వానికి వస్తాయి. వీటిపైన కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. అవన్నీ పరిష్కారమయ్యే వరకు ఏ చర్యలు తీసుకోబోమని చెప్పి కూడా ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖలో భూములు ఇవ్వాలి..

నిజానికి అమరావతి రాజధాని కాదని విశాఖ వెళ్లిపోతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్రంలోని పేదలకు విశాఖలోనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇవ్వాల్సి ఉంది. రాజధాని కాకుండా అమరావతిలో ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి. రైతులు ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకే వాడాలి. కానీ ప్రభుత్వం దుర్బుద్ధితో కుట్రపూరితంగా నాలుగేళ్లుగా ప్రజా రాజధానిపై కుట్రలు చేస్తూనే ఉంది. న్యాయస్థానాలు అడ్డుకున్న కోర్టులు కొట్టేసిన పర్వాలేదు. తాము చేయాలనుకున్నది చేస్తామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. విశాఖ రాజధానిగా చెబుతున్న వైసీపీ ప్రభుత్వం అక్కడే నిరుపేదలకు భూములు ఇవ్వాలన్న డిమాండ్ సర్వత్ర వ్యక్తం అవుతోంది.

Exit mobile version