Anam Ramanarayana Reddy: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయరెడ్డిని వైసీపీ అధిష్టానం దూరం పెడుతోందా? ఆనమే పార్టీ నుంచి దూంగా జరుగుతున్నారా? అసలు నెల్లూరులో ఏం జరుగుతోంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు కాక పుట్టిస్తున్నాయి. ఏకగ్రీవం అవుతుందనుకున్న ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యం కావడం, బీజేపీ ప్రధాన పోటీదారుగా బరిలో నిలబడటంతో ఈ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గ పరిధిలోని ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని, ఒక ఎమ్మెల్యేని ఇనచార్జులుగా నియమించి, బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అగ్రనాయకులందరినీ రంగంలోకి దింపారు కానీ ఆనం రామనారాయణరెడ్డిని ఈ ఎన్నికల్లో భాగస్వామిని చేయలేదు. పార్టీ బాధ్యతలు అప్పగించలేదా? లేక ఆహ్వానించినా ఆనం ఆసక్తి చూపలేదా? అనేది అంతుపట్టని విషయంగా మారింది. విశేషమేమంటే సంగం మండలంలో కొంత పరిచయాలు, బంధువర్గం ఉందన్న ఉద్దేశంతో కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని అదనపు ఇన్చార్జిగా నియమించారు. కానీ ఐదేళ్లపాటు ఆత్మకూరుకు ఎమ్మెల్యేగా పనిచేసి, ఆత్మకూరు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన ఆనం పేరును ఈ బాధ్యుల జాబితాలో చేర్చలేదు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నాయకులంతా హాజరయినా ఆనం మాత్రం ముఖం చాటేశారు.
పార్టీపై కీనుక..
వాస్తవానికి ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో ఏమంత సంతృప్తిగా లేరనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తోంది. జిల్లాలోనే సీనియర్ నాయకుడై ఉండి, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన ఈయనకు జగన క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కలేదు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రుల తలలో నాలుకలా మెలిగిన ఆనంకు ముఖ్యమంత్రి జగనరెడ్డి నుంచి కనీస గుర్తింపు దక్కడం లేదనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాల పట్ల ఆనం అనాసక్తిగానే ఉన్నారని ప్రజలు భావించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడులో చోటు చేసుకున్న సంఘటన అందరి దృష్టిని మార్చేసి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమై కూర్చుంది.
Also Read: Mekapati Family: మేకపాటి కుటుంబంలో వేరు కుంపట్లు.. ఆసక్తిగా ఆత్మకూరు ఉప ఎన్నికలు
మహానాడు నుంచి..
మహానాడులో ఆనం కుమార్తె కైవల్యరెడ్డి నారా లోకే్‌షను, చంద్రబాబులతో భేటీ అయ్యారు. కైవల్యారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఆత్మకూరు టిక్కెట్టును ఆశిస్తోందని, ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి వాయిదా పడింది కానీ 2024 ఎన్నికల్లో ఆమెకు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ లభించిందనే ప్రచారం ఊపందుకుంది. ఆనంకు తెలియకనే ఇదంతా జరిగిందా అనే ప్రచారం జరిగింది. ఈ కలయికతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కైవల్యారెడ్డి ఇప్పుడు బిజివేములవారి ఇంటి కోడలని, అక్కడే కాపురం ఉంటోందని, ఎందుకు కలిసిందో ఆమెనే అడగాలని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు. అయినా కైవల్యారెడ్డి భేటీకి ప్రాధాన్యత తగ్గలేదు. కైవల్యరెడ్డికి వివాహమై పదేళ్లు అవుతున్నా, ఇంత కాలం ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు చంద్రబాబుతో భేటీ అయ్యిందనే ప్రశ్నలు వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ఆత్మకూరు ఉప ఎన్నికలకు ఆనం దూరంగా ఉన్నారని కొందరు, అధిష్ఠానమే ఆయనకు బాధ్యతలు అప్పగించలేదని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తరువాత ఆనం కుటుంబం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:Chandrababu Internal Survey: టీడీపీ నేతలకు సర్వే గుబులు..నేతల పనితీరుపై చంద్రబాబు ఫొకస్