Mekapati Family: ఆత్మకూరు ఉప పోరు వైసీపీకి, మేకపాటి కుటుంబానికి సవాల్ గా మారింది. అసాధారణ మెజార్టీ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మేకపాటి విక్రమ్ రెడ్డిపై సొంత వర్గీయులు, కుటుంబ సభ్యులే కత్తులు నూరుతుండటం అయోమయానికి గురిచేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం పోటీకి దూరంగా ఉన్న నేపథ్యంలో మెజార్టీ రాకపోతే సీఎం జగన్ దగ్గర పరువు పోతుందని… రాజకీయ భవిష్యత్తుకీ ఇబ్బంది కలుగుతుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి మథనపడుతున్నారుట. గౌతమ్ మరణానంతరం… ఆయన భార్య శ్రీకీర్తిరెడ్డికి టిక్కెట్టు ఇస్తారనుకున్నారు. ఆమె ఎమ్మెల్యే అయితే… గతంలో మాదిరిగానే నాలుగు డబ్బులు వెనుకేసుకోవచ్చని కొందరు నేతలు భావించారు. అయితే ఇప్పటి వరకు తమ కుటుంబంలో మహిళలు ఎవరు రాజకీయాల్లోకి రాకపోవడంతో ఈ విషయమై కుటుంబమంతా చర్చించుకుని, చివరకు గౌతమ్ సోదరుడు విక్రమ్ ని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీఎం జగన్ కూడా విక్రమ్ ని అంగీకరించక తప్పలేదు. అయితే ఆత్మకూరులో కేడర్ మాత్రం రాజమోహన్ రెడ్డి వర్గీయులుగా, గౌతమ్ వర్గీయులుగా చీలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అన్నను విభేదిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి
మరోవైపు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితో విభేదాలున్నాయి. అవి ఉప ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నాయి. న్యాయంగా తన కుటుంబం నుంచి తనకు రావాల్సిన ఆస్తిపాస్తులను రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన విక్రమ్ రెడ్డికి ఎంతవరకూ సహకరిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకూరులో విక్రమ్ రెడ్డికి మెజార్టీ రాకుండా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఆత్మకూరుకి పనిగట్టుకుని వెళ్లి మరీ, రాజకీయ శత్రువుగా భావించే ధనుంజయరెడ్డిని చంద్రశేఖర్‌రెడ్డి కలవడం సంచలనమైంది. పైగా చాలా మందితోనూ ఆయన ఫోన్లలో టచ్‌లో ఉన్నారుట. విక్రమ్ మెజార్టీని బాగా తగ్గించగలిగితే రాబోయే రోజుల్లో తానే కింగ్ గా ఉండొచ్చనే ఉద్దేశంతో ఆయన ఇలా తెరవెనుక పావులు కదుపుతున్నారని చెపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే చంద్రశేఖర్ రెడ్డి… సొంత అన్న కుమారుడైన విక్రమ్ రెడ్డి విషయంలో ఈ తీరుగా వ్యవహారిస్తున్నారని జనం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
Also Read: Chandrababu- 2024 Elections: ఈ రెండేళ్లు జనంలోనే.. పక్కా ప్రణాళికతో చంద్రబాబు..
కాలు దువ్వుతున్న మేనల్లుడు..
అయితే విక్రమ్ రెడ్డికి వ్యతిరేకంగా ధీటైన అభ్యర్థి ఇంతవరకూ తెరపైకి రాలేదు. కానీ… రాజమోహన్ రెడ్డి సొంత మేనల్లుడు బిజివేముల రవీంద్రనాధ్ రెడ్డి మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. మేకపాటి వారి వల్ల మెట్టప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు అభివృద్ధిలో మరింతగా వెనుకపడ్డాయని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే తాను ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిపై పోటీకి దిగుతున్నానంటూ ప్రకటించారు. బీజేపీ తరుపున టిక్కెట్టు తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇండిపెండెంట్ గా కూడాబరిలోకి దిగేందుకు ఆయన వెనుకాడటం లేదు. ఇంకొంత మంది కూడా పోటీకి సిద్దమవుతున్నారు.
ముఖం చాటేస్తున్న అనుచరులు
ఇక వ్యాపారాల్లో ఫుల్ బిజీగా ఉండే విక్రమ్ రెడ్డి… కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నారు. అయితే ఆయన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తే… సొంత వర్గీయులు, ముఖ్యులే హాజరుకావడం లేదు. వారందర్నీ బతిమిలాడటం, తమవైపు తిప్పుకోవడం ఆయనకు తలనొప్పిగా తయారైంది. అయితే గ్రామాల్లో జనం మాత్రం విక్రమ్ రెడ్డి రాగానే సమస్యలు ఏకరవు పెడుతున్నారు. మూడు నెలల్లో సమస్యలు తీరుస్తానంటే… ముప్పై ఏళ్లగా మీరే ఎమ్మెల్యేలు… మీరే మంత్రులు… మీరే ఎంపీలు… అప్పుడంతా సమస్యలు తీర్చలేని వారు, మూడు నెలల్లో ఏం తీరుస్తారంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.
Also Read:Pawan Kalyan Tweets: జనసేన సైనికులారా జరభద్రం… పవన్ ట్విట్ల వెనుక కథ ఇదా?