Botsa legislative council entry: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈరోజు శాసనమండలికి హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ గురైనట్లు వార్తలు వచ్చాయి. కానీ రక్త పోటులో వచ్చిన తేడాతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అన్నట్టుగానే వారం రోజులు విశ్రాంతి తీసుకొని ఈరోజు శాసనమండలికి చేరుకున్నారు. కాగా బొత్స సత్యనారాయణకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు పలకరించారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొత్స లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బొత్స బాధపడుతున్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఆయన త్వరగా కోలుకొని శాసనమండలికి హాజరు కావడంపై అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
బొత్స తిరిగిరాక..
అయితే బొత్స తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు.. ఆయన క్రియాశీలక రాజకీయాల ( politics) నుంచి తప్పుకుంటారని తెగ ప్రచారం నడిచింది. ప్రస్తుతం ఆయన శాసనమండలలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్నారు. అది క్యాబినెట్ హోదాతో కూడుకున్న పదవి. దీంతో ఆ పదవి కోసం చాలామంది వైసిపి నేతలు క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. బొత్స ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో శాసనమండలికి త్వరితగతిన హాజరు కావడంపై.. వారి ఆశలపై నీళ్లు పోసినట్లు అయింది. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు. కానీ ఆ హోదాలో ఉన్నారు బొత్స సత్యనారాయణ. అందుకే ఆ పదవి కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా పోటీ కనిపించింది. బొత్స అనారోగ్యానికి గురవడంతో చాలామంది వైసిపి నేతలు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం నడిచింది.
క్యాబినెట్ హోదా పదవి..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. ఆ హోదా లేనిదే సభకు రామని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. అయితే సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ ను ఎమ్మెల్సీ ని చేసి.. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే అంతకుముందు ఆ పదవిలో లేళ్ల అప్పిరెడ్డి ఉండేవారు. ఆయనను తొలగించి మరీ బొత్సకు అప్పగించారు. ఇప్పుడు అనారోగ్యంతో బచ్చన్ తప్పిస్తే తనకు పదవి ఇస్తారని అప్పిరెడ్డి భావించారు. ఓ నలుగురు వరకు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ బొత్స సత్యనారాయణ తిరిగి రావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.