Rayalaseema TDP: వాళ్లను లాగితే రాయలసీమలో టీడీపీ బలం పుంజుకుంటుందా?

రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ నుంచి బలమైన వాయిస్ వినిపించింది. టిడిపి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఉద్యమకారులు పలు అంశాలపై పోరాడారు.

Written By: Dharma, Updated On : October 13, 2023 6:11 pm

Rayalaseema TDP

Follow us on

Rayalaseema TDP: తెలుగుదేశం పార్టీ రాయలసీమ పై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల నాటికి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. మొన్న జైలులో కలిసిన పయ్యావుల కేశవ్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ కార్యక్రమాలు జరగాలని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా రాయలసీమ ఉద్యమకారులను కలుపుకు వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.

రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ నుంచి బలమైన వాయిస్ వినిపించింది. టిడిపి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమ ఉద్యమకారులు పలు అంశాలపై పోరాడారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీమ డిమాండ్లు నెరవేర్చుతారని భావించారు. కానీ నాలుగున్నర ఏళ్ళు అవుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యమకారులు చంద్రబాబు బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. అటువంటి వారిని పార్టీలోకి తీసుకుంటే రాయలసీమలో బలం పెంచుకోవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందులో భాగంగానే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ని పార్టీలోకి తేవాలని డిసైడ్ అయ్యారు. అటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం టిడిపి గూటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. కానీ ఇంతలో చంద్రబాబు కేసుల్లో అరెస్టు అయ్యారు. అయినా సరే బైరెడ్డి రాజమండ్రి వచ్చి నారా భువనేశ్వరిని పరామర్శించారు. త్వరలో టిడిపిలోకి వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు.

సీమ సమస్యలపై పోరాడుతున్న వివిధ కులాలకు చెందిన యువకులు, ప్రజాసంఘాల నాయకులతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడే చర్చలు జరుపుతున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. రాయలసీమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారికి నచ్చ చెబుతున్నారు. మరోవైపు సీమ విషయములో ఆశించిన స్థాయిలో జగన్ స్పందించడం లేదని.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదన్న ఆగ్రహం, ఆవేదన సీమ ప్రజల్లో ఉంది. దీనిని అనుకూలంగా మలుచుకోవాలని టిడిపి భావిస్తోంది. సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ ఉద్యమిస్తున్న బొజ్జ దశరథ రామిరెడ్డిని టిడిపిలోకి రప్పించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కీలకమైన నంద్యాల టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో టిడిపి నాయకత్వం ఉన్నట్టు సమాచారం.

వాస్తవానికి రాయలసీమ వైసిపికి అడ్డా. పార్టీ ఆవిర్భావం నుంచి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో 52 స్థానాలు గాను.. 49 చోట్ల విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇప్పటికీ అదే బ్రాహ్మల్లో బతుకుతుంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటాం అన్న ధీమాతో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాయలసీమలో పట్టు బిగించాలని అడుగులు వేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి ఎదురు దెబ్బ ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.