ICC World Cup 2023: వన్డే వరల్డ్ కప్ – 2023 మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలక మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ వీకెండ్.. దాయాదుల సమరంతో హోరెత్తనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టిస్‌లో నిమగ్నమయ్యాయి. ఈసారైనా భారత్‌ను ఓడించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది. గత చరిత్రను కొనసాగించాలని భారత్ ఉవ్విల్లూరుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో వందల మ్యాచ్‌లు జరిగాయి. కానీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు భారత్‌దే పైచేయి.
14న భారత్ పాక్ మ్యాచ్..
ఐసీసీ ప్రపంచ కప్ 2023 నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినందున, శనివారం (అక్టోబర్ 14) మధ్యాహ్నం 2 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ కూడా హోరాహోరీగా జరుగడం ఖాయం. స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారత్‌కు అనుకూలంగా ఉంటుంది. టీమిండియాకు కలిసవచ్చే అంశం. అదేసమయంలో దాయాది దేశం కావడంతో పాకిస్తాన్‌పై ఒత్తిడి ఉంటుంది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లు ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే.
ఆసక్తిగా అభిమానుల ఎదురు చూపు..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక 24 గంటలు ఎప్పుడు గడుస్తాయా అని టికెట్ కొన్నవారితోపాటు భారత, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
రికార్డులు ఇలా..
వన్డేల్లో భారత్, పాకిస్తాన్ జట్లు 134 సార్లు తలపడ్డాయి. పాకిస్తాన్ 73 గేమ్‌లను గెలుచుకుంది. భారతదేశం 56 గెలిచింది. ఐదు మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు స్వదేశంలో భారత్ 11 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్తాన్ 17 మ్యాచ్‌లు గెలిచింది. భారత గడ్డపై కూడా పాకిస్తాన్ భారత్‌పై 19 మ్యాచ్‌లు గెలిచింది. ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ దశలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే, కాంటినెంటల్ టోర్నీలో వారి మొదటి మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.
వరల్డ్ కప్‌లో భారత్‌దే పైచేయి..
ఇక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాక్ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించించింది. ఏడు మ్యాచ్‌లు భారత్ గెలవగా, పాకిస్తాన్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2011 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2019 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల ఫలితాలు..
1992, మార్చి 4, సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం 43 పరుగులతో గెలిచింది.
1996, మార్చి 6, బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో భారత్ 39 పరుగులతో గెలిచింది.
1999, జూన్ 8, మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగులతో గెలిచింది.
2003, మార్చి 1, సెంచూరియన్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
2011, మార్చి 30, మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగలతో గెలిచింది.
2015, ఫిబ్రవరి 15, అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగలతో భారత్ గెలిచింది.
2019, జూన్ 16, మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగులతో పాక్‌ను చిత్తు చేసింది.