https://oktelugu.com/

రజినీకాంత్ వస్తారా? హీటెక్కిన తమిళ పాలిటిక్స్

వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కానీ.. ఈ క్రమంలో అమిత్‌ షా ఈనెల 21న రాష్ట్రంలో పర్యటించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుడు మురుగన్‌, పార్టీ ప్రముఖులు సిద్ధమయ్యారు. అమిత్‌షా తన పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్‌ నేతలు, జిల్లా శాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన వ్యూహరచనలు చేయనున్నారు. మరోవైపు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 02:15 PM IST
    Follow us on

    వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కానీ.. ఈ క్రమంలో అమిత్‌ షా ఈనెల 21న రాష్ట్రంలో పర్యటించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేసేందుకు మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకుడు మురుగన్‌, పార్టీ ప్రముఖులు సిద్ధమయ్యారు. అమిత్‌షా తన పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్‌ నేతలు, జిల్లా శాఖ కార్యదర్శులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన వ్యూహరచనలు చేయనున్నారు.

    మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే, డీఎంకే, మక్కల్‌నీదిమయ్యం పార్టీలు అప్పుడే వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీలున్నాయి. ప్రస్తుతం డీఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. అయితే అధికార అన్నాడీఎంకే కూటమిలో అనిశ్చిత పరిస్థితులు కొనగసాగుతున్నాయి. బీజేపీ, పీఎంకే, డీఎండీకేల కూటమి పై రోజుకో విధంగా ప్రకటనలు వస్తున్నాయి.

    ఈసారి బీజేపీ నాయకత్వంలోనే మెగా కూటమి ఏర్పాటవుతుందని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మురుగన్‌ ఆ మధ్య ప్రకటించి కలకలం సృష్టించారు. మంత్రి డి.జయకుమార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోనూ బలమైన కూటమి ఏర్పాటవుతుందని, ఆ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అన్నాడీఎంకే కూటమిలోని చిన్నాచితక పార్టీలు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎక్కువగా సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నాయి. అదే సమయంలో ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు సీమాన్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి, టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం, ఉలగనాయగన్‌ కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే కూటముల గెలుపోటములను తీర్మానించే విధంగా రోజురోజుకూ బలపడుతున్నాయి.

    బీహార్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌జేపీ, ఒవైసీ మజ్లిస్‌ పార్టీల వల్ల ప్రముఖ పార్టీలు ఓటమి పాలైన విషయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అధిష్టానవర్గాలు గమనించి రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలని భావిస్తున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ మళ్లీ వెట్రివేల్‌ యాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల ఆరు నుంచి డిసెంబర్‌ ఆరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వెట్రివేల్‌ యాత్ర జరుపనున్నట్టు మురుగన్‌ ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఆ యాత్రకు అనుమతివ్వలేదు.

    ఇదిలా ఉండగా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను అమిత్‌షా చెన్నైలో కలుసుకోనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కరోనా లాక్‌డౌన్‌, తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ పార్టీని ఇప్పట్లో ప్రారంభించే ఉద్దేశం లేదంటూ ఇటీవలే రజనీకాంత్‌ ప్రకటించారు. అయితే రజనీకాంత్‌ మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పలుమార్లు ప్రకటనలు చేసి ఆ పార్టీకి, పార్టీ జాతీయ నాయకులకు దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ మద్దతు పొందితే బాగుంటుందని అమిత్‌ షా భావిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఇక బీజేపీ తరఫున రజనీకాంత్‌ ప్రచారంలోకి దిగనున్నారనేది నిజం.