MLA Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? వేరే పార్టీలోకి జంప్ అవుతారా? జగన్ కు ఝలక్ ఇస్తారా? ఈ మేరకు సంకేతాలు పంపారా? అందుకే జగన్ అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పురమాయిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టిడిపి అభ్యర్థి దేవినేని ఉమా పై విజయం సాధించారు. సిట్టింగ్ మంత్రిగా ఉన్న ఉమా పై నెగ్గుకు రాగలిగారు. కానీ జగన్ ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వసంత కృష్ణ ప్రసాద్ లో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ వసంత కృష్ణ ప్రసాద్ ను అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు. కానీ జగన్ నియంత్రించే ప్రయత్నం చేయలేదు. అందుకే వసంత కృష్ణ ప్రసాద్ లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది.
జగన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు ఐదు జాబితాలను ప్రకటించారు. 62 మంది సిట్టింగ్లను మార్చారు. మరోవైపు సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో తొలి సభను పూర్తి చేశారు.ఎల్లుండి ఏలూరు పక్కనే ఉన్న దెందులూరులో రెండో సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సిద్ధం సభ ఏర్పాట్లలో నిమగ్నం కావాల్సిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండటం విశేషం. గత కొంతకాలంగా అధికార పార్టీలో వసంత కృష్ణ ప్రసాద్ నిరసన గళం వినిపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపణలు చేశారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఆయన తిరిగి వైసిపి నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్న బలమైన చర్చ జరుగుతోంది.
అయితే వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన జాబితాల్లో ఈ నియోజకవర్గం విషయమై ఎటువంటి మార్పు చేయలేదు. కానీ ఎందుకో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెబుతారని.. టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. దీనిని నిజం చేసేలా ఆయన సంకేతాలు పంపుతున్నారు. జగన్ సిద్ధం సభకు వైసీపీ క్యాడర్ ను, నేతలను పంపించేందుకు ఆయన చొరవ చూపడం లేదు. దూరంగా ఉండిపోయారు. దీంతో ఆ బాధ్యతను పార్లమెంట్ ఇంచార్జ్ కేశినేని నానికి హై కమాండ్ అప్పగించింది. ఎల్లుండి సభకు వసంత కృష్ణ ప్రసాద్ రాకుంటే మాత్రం ఆయన వైసీపీని వీడడం దాదాపు ఖాయమైనట్టే.