Budget 2024: లోక్‌సభ ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రం పార్లమెంట్‌లో గురువారం (ఫిబ్రవరి1న) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలాసీతారమన్ మొరార్జీదేశాయ్ రికార్డును సమం చేశారు. ఇక మధ్యంతర బడ్జెట్‌లో భారీగా ఊరట ఉంటుందని వేతన జీవులు ఆశించారు. కానీ పన్ను స్లాబుల్లో ఆర్థిక మంత్రి ఎలాంటి మార్పులు చేయలేదు. 2023–24 పన్ను స్లాబ్‌నే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష పన్నుల్లో వివాదాలకు సంబంధించిన నోటీసులపై మాత్రం కొంత ఊరటనిచ్చారు.
పన్నుల జోలికి వెళ్లని కేంద్రం..
ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పన్నుల విధానాల్లో మార్పుల జోలికి వెళ్లలదేదు. ఆదాయపు పన్ను కొత్త విధానంలో వారికి రూ.7 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని పునరుద్ఘాటించారు. 2013–14లో పన్ను పరిమితి రూ.2.2 లక్షలు ఉండగా, దానిని రూ.7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కార్పొరేట్ పన్నును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. ఇక ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని తెలిపారు.
ప్రత్యక్ష పన్నుల వివాదాలకు ఊరట..
ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాస్పద డిమాండ్ నోటీసులు అందుకున్నవారికి కేంద్రం ఈ బడ్జెట్‌లో ఊరట నిచ్చింది. 2009–10 మధ్య రూ.25 వేల వరకు విలువైన డిమాండ్ నోటీసులను రూ.10 వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేశారు. దీంతో కోటి మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వ్యాపారాలను సరళతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చిన్నమొత్తంలో ఉన్న ప్రత్యక్ష పన్ను వివాదాస్పద డిమాండ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు.
పది రోజుల్లో ఐటీ రిఫండ్..
ఇక ఆదాయపు పన్ను రిఫండ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. 2013–14లో సగటున 93 రోజులుగా ఉండగా ప్రస్తుతం దానిని 10 రోజులకు తగ్గించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.