https://oktelugu.com/

కేసీఆర్‌‌ వరాలు అమల్లోకి వచ్చేనా..?

తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ప్రజలను షాక్‌కు గురిచేశారు. అది ఒక వర్గాన్ని కూడా కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యపరిచారు. కొత్త ఏడాది సందర్భంగా అందరికీ తీపి వార్తలంటూ ప్రకటించారు. ఇంతకాలం ఏం జరిగినా కన్నెత్తి చూడని ఆయన.. ఇప్పుడు ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల వేతనాల పెంపు నుంచి ఎల్ఆర్ఎస్ రద్దు వరకూ అదే తంతు. కొత్త ఏడాది సందర్భంగా వేతనాల పెంపును కేసీఆర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 30, 2020 / 11:31 AM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్‌‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ప్రజలను షాక్‌కు గురిచేశారు. అది ఒక వర్గాన్ని కూడా కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యపరిచారు. కొత్త ఏడాది సందర్భంగా అందరికీ తీపి వార్తలంటూ ప్రకటించారు. ఇంతకాలం ఏం జరిగినా కన్నెత్తి చూడని ఆయన.. ఇప్పుడు ఊహించని విధంగా స్పందిస్తున్నారు. ఉద్యోగుల వేతనాల పెంపు నుంచి ఎల్ఆర్ఎస్ రద్దు వరకూ అదే తంతు. కొత్త ఏడాది సందర్భంగా వేతనాల పెంపును కేసీఆర్ ప్రకటించారు. విధివిధానాలేమీ ప్రకటించకపోయినా కొత్త ఏడాదిలో తాను మంచి చేయబోతున్నానన్న సందేశాన్ని ఉద్యోగులకు పంపారు.

    రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. అందుకే.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఉద్యోగులను సంతృప్తిపరచాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. సాధారణంగా కేసీఆర్.. అన్ని రకాల సమస్యలు పెట్టి చివరిగా ఒక్కసారిగా వారి సమస్యను పరిష్కరించి వారితో పాలాభిషేకాలు చేయించుకుంటుంటారు. అయితే అది ఎల్లకాలం నడవదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి మారింది. సమస్యలను పరిష్కరించినా.. తమను పెట్టిన బాధలను ఉద్యోగులు గుర్తుంచుకునే పరిస్థితి కనిపిస్తోంది.

    Also Read: టిపిసిసి చీఫ్ ఎంపికపై హైడ్రామా!

    ఏమైందో ఏమో తెలియదు కానీ.. కొద్ది రోజులుగా కేసీఆర్‌‌ వివిధ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా ప్రకటనలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావమో.. మరేంటో కానీ ఒక్కో వర్గాన్ని సంతృప్తి పరచాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లున్నారు. అందుకే.. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ విషయాన్ని కూడా తెరమీదకు తెచ్చారు. మామూలుగా అయితే కరోనా కాలంలో ఎలాంటి పీఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదని.. సంకేతాలు ఇచ్చారు. కానీ.. ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించేశారు. అంతటితో ఆగకుండా ఉద్యోగ విరమణ వయస్సును కూడా పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు వారికీ వరాలు ప్రకటిస్తున్నారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచి.. ఆ భారాన్ని ఆర్టీసీ కాకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు.

    Also Read: రౌండప్: కేసీఆర్ తో ‘2020’ ఆడేసింది..!

    అయితే.. ఒక్కసారిగా కేసీఆర్‌‌ అనూహ్య నిర్ణయాలు ప్రకటించడంతో ప్రజల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. అవి అమలవుతాయా లేదా అన్న సందేహాలున్నాయి. ఎందుకంటే.. కేసీఆర్ ఏ నిర్ణయమైనా కారణం లేకుండా తీసుకోరు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో దిగజారిపోయిన తన రాజకీయ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఈ పాచికలన్నీ వేస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. గతంలోనూ నోటిఫికేషన్లు ఇచ్చి వాటిపై కోర్టుల్లో కేసు వేయించారని ఇప్పటికే కేసీఆర్‌‌ ఓ అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే.. కేసీఆర్‌‌ ఇప్పుడు ప్రకటించిన ఈ వరాల మీద కూడా ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. అవన్నీ అమల్లోకి వచ్చే సరికి చూద్దంలే అన్నట్లు ఉన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్