Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ ఆయనకు సహకరించేది ముగ్గురే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమత్రి విజయన్. కానీ ఈ ముగ్గురు కూడా గోడ మీది పిల్లులే కావడం గమనార్హం. బీజేపీ జాతీయ పార్టీ కావడంతో దాని నెట్ వర్క్ కూడా భారీగానే ఉంటుంది. పైగా వారు సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. ఈ మూడు తోక పార్టీలు బీజేపీని ఏం చేస్తాయనే వాదన కూడా వస్తోంది.
ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనే ఏం చేయలేక చేతులెత్తోస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం ఏదో వెలగబెడతారనే ఉద్దేశంతో పావులు కదవడం చూస్తుంటే కూట్లో రాయి ఏరేలనోడు ఏట్లో రాయి ఏరినట్లు ఉందని అంటున్నారు. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికెగిరిందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ముందు రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సింది పోయి దేశాన్ని ఏదో చేస్తామని బీరాలకు పోవడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఏం చేయలేకనే మిన్నకుండి పోతోంది. అలాంటిది కేసీఆర్ జాతీయరాజకీయాలను శాసించే సత్తా ఉందని గొప్పలకు పోవడం పరువు తీసుకోవడమేనని చెబుతున్నారు. రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు నుంచి అన్నింట్లో బీజేపీకి నష్టం చేయాలని చూస్తున్నా అది నెరవేరడం లేదు.
Also Read: విభజన హామీలు కొలిక్కి వచ్చేనా?
దీంతోనే ప్రస్తుతం జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు చేస్తామని గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునే సందర్భం వస్తుందని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే మాటలు కాదు దానికి ఎంతో నెట్ వర్క్ కావాలి. దానికి కేసీఆర్ కు ఉన్న శక్తి చాలదు. ఏదో మన ప్రజలను బురిడీ కొట్టించిన ఈజీగా దేశ ప్రజలను వంచించడం అంత సులభం కాదు.
ఇన్ని తెలిసినా కేసీఆర్ కు ఎందుకు జాతీయ రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మూడు పార్టీలతో దేశాన్ని ఏలే సత్తా వస్తుందని అనుకోవడం భ్రమే అవుతుంది. కానీ కేసీఆర్ బీజేపీపై ఉన్న కోపంతో గోతిలో పడుతున్నారనే వదంతులు కూడా వస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మరింత ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి.
Also Read: కన్ఫ్యూజ్ చేస్తున్న గంటా.. చంద్రబాబు రమ్మన్నా రావట్లే.. వేరే ప్లాన్ ఉందా..?