India Rice Export Ban 2023: వరి పండించే దేశాల్లో భారత్ ప్రధానంగా ఉంటుంది. మిగతా దేశాల్లో కంటే ఇక్కడ పండించే వరికి డిమాండ్ ఎక్కువ. అందుకే భారత్ వివిధ దేశాలకు వడ్లను బియ్యంగా మార్చి ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ మనవాళ్లు ఉన్నా అన్నంను తినగలుగుతారు. అందువల్ల అక్కడివారి కోసమైనా బియ్యాన్ని నిత్యం ఎగుమతి చేస్తుంటారు. అయితే భారత్ ఇటీవల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. కొన్నాళ్ల పాటు సోనా మైసూర్ లాంటి బియ్యాన్ని ఎగుమతి చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో అన్నం తినేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బియ్యం కోసం క్యూ కట్టిన సీన్ బయటకొచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అసలు దేశంలో బియ్యం కొరత ఎందుకు ఏర్పడింది? అనే విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది.
భారత్ లో ప్రధాన పంట వరి. దేశంలోని 70 నుంచి 80 శాతం మంది అన్నంనే ఎక్కువ తింటారు. అయితే రకరకాల పంటలను వేయడం ద్వారా ఆయా ప్రాంతాల వారు వారి రుచులకు అనుగుణంగా బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో నాసిరకమైనా తినగలుగుతారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సోనా మసూరి మాత్రమే తినగలుగుతారు. తాజాగా సోనా మసూరి బియ్యం తీవ్ర కొరత ఏర్పడింది. దేశంలో ఉన్న వీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని వారికంటే దేశంలోని వారికి ధాన్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.
ఈ ఏడాది జూన్ మాసంలో సౌత్ లో చినుకు కనిపించలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసాయి. ఢిల్లీతో పాటు ఛత్తీస్ గడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు పొంగి ప్రవహించాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.కొందరు రైతులు రెండో క్రాప్ వేసే సమయంలో ఈ వర్షాలు రావడంతో వారు పంటలను ఆలస్యంగా వేశారు. మన దేశంలో వరిని ఛత్తీస్ గఢ్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తారు. ఆ తరువాతి స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. అయితే ఆంధ్రాలోనూ ఈసారి పంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వచ్చే పంటలు ఆలస్యంగా చేతికి వస్తాయి.
దీంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఉన్న నిల్వలను కాపాడుకునేందుకు ఎగుమతులను నిలిపివేసింది. ఇప్పటికే టమాట పండించే రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వాటి ధరలు కొండెక్కాయి. ఇప్పుడు బియ్యం విషయంలో అదే జరిగితే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయి. అందువల్ల ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అయితే ఇది శాశ్వతం కాదని, వచ్చే పంట తరువాత యథాస్థితికి వస్తుందని అంటున్నారు.