ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి ప్రశంసలు దక్కాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌పై డబ్ల్యూహెచ్‌వోలోని కరోనా వైరస్ ప్రత్యేక రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో ప్రశంసలు కురిపించారు. ఇది చాలా ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమనీ, ప్రభుత్వం సరైన సమయంలో సరైన విధంగా స్పందించిందని కొనియాడారు. సాధ్యమైనంత త్వరగా కరోనా మహమ్మారి నుంచి భారత్ బయటపడాలని డాక్టర్ నబారో ఆకాంక్షించారు.
కరోనా వైరస్ కథ ఇప్పట్లో ముగుస్తుందని చెప్పలేమన్న ఆయన… భవిష్యత్తులో దీనిపై కొత్త ప్రమాణాలను రచించాల్సి రావచ్చునని పేర్కొన్నారు. ఎంత ముందుగా స్పందిస్తే అంత త్వరగా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, భారత్ ముందుగా స్పందించిన కారణంగా దేశం మొత్తానికి ఈ శత్రువు నిజస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. సకాలంలో లాక్‌డౌన్ విధించడం వల్ల క్షేత్రస్థాయిలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అధికారులకు తగినంత సమయం దొరికిందని అని డాక్టర్ నబారో పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌తో పాటు అధికారులు ఇతర కీలక అంశాలపైనా దృష్టి సారించాలని నబారో సూచించారు. సామాజిక స్థాయి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ, ఆరోగ్య కార్యకర్తలకు అత్యుత్తమ భద్రత ఈ రెండూ భారత్‌లో కరోనా వైరస్‌ప పోరాడేందుకు అత్యంత కీలకమైన అంశాలని ఆయన విశ్లేషించారు. కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక స్థాయిలోనే టార్గెట్ చేయాలనీ.. ఇందుకోసం మూడంచెల విధానాన్ని అనుసరించడం అవసరమని నబారో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైరస్ సోకిన వ్యక్తులను ఇతరులతో కలిసే అవకాశం లేకుండా క్వారంటైన్ లేక ఐసోలేషన్ కు తరలించాలన్నారు.