
పోలీసులు, మావోయిస్టుల మధ్య అసలు ఏం జరుగుతోంది..? మావోయిస్టుల ఏరివేలకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ 2020కి ఏమైనా శ్రీకారం చుట్టారా..? తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పేరు వినిపించకుండదనే పంతంతో స్వయానా పోలీసు బాస్ రంగంలోకి దిగారా..? అందుకే ఆసిఫాబాద్‌లో నాలుగు రోజులు మకాం వేశారా..? ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోకి యాక్షన్ టీంలు ప్రవేశించాయనే సమాచారంతోనే నెల రోజులుగా గోదావరి తీరాన్ని చక్రబంధం చేశాయా..? రోజుకో తీరుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఈ ప్రశ్నలకు బలాన్నే చేకూరుస్తున్నాయి.
Also Read: పీవీకి భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, స్థానిక కేడర్‌తో కలిసి ఆయన తన కార్యకలాపాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందుకే డీజీపీ మహేందర్‍రెడ్డి నాలుగు రోజులు అక్కడ మకాం వేసి హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. కూంబింగ్ చేస్తున్న బలగాలకు సూచనలు చేశారు. వరుస సమీక్షలూ పెట్టారు. మరోవైపు అగ్రనేతలు గణపతి, ఆయన భార్య సుజాత, కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఆయన భార్య తారాభాయ్, కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కడారి సత్యనారాయణ లొంగిపోతున్నట్లుగా లీకులు ఇచ్చి మావోయిస్టు పార్టీని గందరగోళానికి గురి చేశారు. ఇదే సమయంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లపల్లి వద్ద జరిగిన ఎన్‍కౌంటర్‍లో అగ్రనేత హరిభూషణ్ గన్‌మెన్ శంకర్ అలియాస్ దుడి దేవాలు హతమయ్యాడు. ఒక రకంగా ఇది మావోయిస్టులకు హెచ్చరికగా పరిగణించవచ్చు. లొంగిపోకుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనే సంకేతాలు పరోక్షంగా మావోయిస్టు పార్టీకి తెలంగాణ పోలీసులు పంపించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
శంకర్ ఎన్‍కౌంటర్‍ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఐదు జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‍ను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. కాగా.. మావోయిస్టుల కదలికలను గమనించిన పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటినా గోదావరి తీరంలోని సీఐల బదిలీ కూడా చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసి, అనుభవం ఉన్న సీఐలను అపాయింట్‍చేశారు. 24 గంటల్లోనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు మరోసారి ప్రయత్నించారు. ఆదివారం రాత్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెద్దమిడిసిలేరు–తిప్పాపురం రహదారిపై మందుపాతరను పేల్చారు. రాత్రి 11 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. దళాలను వెంటాడారు.
సోమవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో పూసుగుప్ప అటవీ ప్రాంతంలో 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయని.. ఇందులో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారని ఆ జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఎస్‍బీబీఎల్ తుపాకీ, మరో పిస్తల్‌తోపాటు రెండు కిట్‍బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ బాస్ నుంచి కింది స్థాయి పోలీస్‍స్టేషన్ వరకు మావోయిస్టులతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోలీసులు దూకుడు ప్రదర్శించడంతో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో యుద్ధభూమిని తలపిస్తోంది.
Also Read: తెలంగాణలో ఇక వీరంతా బీసీ కులాల్లోకి..
అటు ఆదిలాబాద్, ఇటు కొత్తగూడెం జిల్లాల్లోని మన్యం ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల జాడ కనిపిస్తే చాలు క్షణాల్లో బలగాలు అక్కడకు చేరిపోతున్నాయి. ఆదివారం ఏడూళ్లబయ్యారం పోలీసులు తాటి సన్ను అనే మావోయిస్టు కొరియర్‍ను అరెస్ట్ చేశారు. సోమవారం దుమ్ముగూడెం పోలీసులు నీలం ఉపేంద్ర అనే సానుభూతిపరుడిని పట్టుకున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే ఉత్తర తెలంగాణలో తిరిగి మావోయిస్టు ఉద్యమం ఊపిరి పోసుకోకూడదనే లక్ష్యంతో తెలంగాణ పోలీసు నిఘాను పెంచినట్లు తెలుస్తోంది. ఆపరేషన్2020 చేపట్టినట్లే అర్థమవుతోంది.
-శ్రీని