ఆరేళ్ల తెలంగాణ.. బంగారు తునక అయ్యిందా?

‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని నినదించిన కవి దశరథి కల నెరవేరిందా? ‘తలాపునే గోదారి.. మన చేను.. చెలక ఏడారి’ అని సాంబశివుడి ఆవేదన తీరిందా? స్వరాష్ట్రం కోసం పోరాడిన ప్రతీ తెలంగాణ పౌరుడి దాహార్తి తీరిందా? ప్రజల కోరికలు నెరవేరాయా? ఆరేళ్ల తెలంగాణలో ఏం జరిగింది? ఉద్యమ రథసారథే.. పరిపాలన దక్షుడైన వేళలో తెలంగాణలో ఏం మార్పు చోటుచేసుకుంది? *అభివృద్ధిలో పరుగులు.. ఉద్యమ సారథి పాలనా సారథి అయితే ఏం జరుగుతుందో కేసీఆర్ […]

Written By: admin, Updated On : June 2, 2020 11:48 am
Follow us on

‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని నినదించిన కవి దశరథి కల నెరవేరిందా? ‘తలాపునే గోదారి.. మన చేను.. చెలక ఏడారి’ అని సాంబశివుడి ఆవేదన తీరిందా? స్వరాష్ట్రం కోసం పోరాడిన ప్రతీ తెలంగాణ పౌరుడి దాహార్తి తీరిందా? ప్రజల కోరికలు నెరవేరాయా? ఆరేళ్ల తెలంగాణలో ఏం జరిగింది? ఉద్యమ రథసారథే.. పరిపాలన దక్షుడైన వేళలో తెలంగాణలో ఏం మార్పు చోటుచేసుకుంది?

*అభివృద్ధిలో పరుగులు..
ఉద్యమ సారథి పాలనా సారథి అయితే ఏం జరుగుతుందో కేసీఆర్ నిరూపించారు. తెలంగాణ దేనికోసమైతే పోరాడిందా వాటినే ఎజెండాగా పెట్టుకున్నారు. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ ఈ మూడింటిలో మొదటిది నీళ్లు.. కాళ్వేశ్వరం కట్టి.. దక్షిణాన దిండి, పాలమూరు-రంగారెడ్డి, నెట్టంపాడు, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టులతో బీడు వారిన భూములకు కేసీఆర్ నీళ్లిచ్చారు. దాదాపు లోటు కరెంట్ తో పొద్దంతా వెలుగులే ఉండని తెలంగాణను ఆరు ఏళ్లల్లోనే పూర్తి విద్యుత్ ఇచ్చే స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందిస్తూ దేశంలోనే తెలంగాణ ప్రగతిని చాటాడు. అన్నదాతల ఊసురు తీసే అప్పులు తీర్చి రుణమాఫీ చేసి.. వారికి ‘రైతుబంధు’ సాయం చేసి ఆదుకున్నారు. రైతులకు కాళేశ్వరం , కృష్ణ జలాలు ఇచ్చి పంట పండించాడు. వారి సిరులు నింపాడు. ఇక ఐటీరంగంలో తెలంగాణను మేటిగా నిలబెట్టాడు. పరిశ్రమలకు ఊపిరి లూది తెలంగాణను దేశంలో ప్రముఖంగా నిలబెట్టాడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో నీటి గోస తీర్చాడు. పింఛన్లు, సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించారు. కళ్యాణలక్ష్మీతో యువతుల తల్లిదండ్రులకు భరోసానిచ్చాడు. కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మీ, ఉచిత వ్యాధి నిర్ధారణ, డయాలసిస్ , హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడం.. ఇలా ఆరేళ్లలో తెలంగాణ దరిద్రాన్నే కేసీఆర్ ప్రారదోలాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్లుగా కేసీఆర్ తెలంగాణను అతి తక్కువ సమయంలో పలు రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారు.

*రాజకీయంగా కేసీఆర్ కు ఎదురులేదు..
తెలంగాణలో అభివృద్ధి-సంక్షేమంలో కేసీఆర్ కు ఎదురులేదు. అందుకే రెండోసారి గెలిచాడు. ఇర రాజకీయంలోనూ కేసీఆర్ అదే చేశారు. ప్రత్యర్థులను చావుదెబ్బ తీశాడు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ను కోలుకోకుండా చేశాడు. తెలంగాణ ఇచ్చిన పార్టీని ఆరేళ్లలో మరింత కృంగదీశాడు. నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకొని.. కాంగ్రెస్ పై ఆశను చంపేశాడు. ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న బీజేపీకి చెక్ పెట్టాడు. పోయిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు వాటి సీట్లను తగ్గించి ఉనికే లేకుండా చేశాడు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు తట్టుకునేలా కనిపించడం లేదు. మరిన్ని పథకాలతో ప్రజలకు చేరువ అవుతున్న కేసీఆర్ ను ఆపేతరం ప్రతిపక్షాలకు లేకుండా కేసీఆర్ ముందుకెళ్తున్నారు.

*నిరుద్యోగుల సమస్యలు పట్టని కేసీఆర్..
నీళ్ల సమస్య కాళేశ్వరం, ఇతర కృష్ణ నదిపై చేపట్టిన ఎత్తిపోతలతో తీరిపోతోంది. మరి నిధులు.. ధనిక రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కోరినా.. కోరకున్నా అభివృద్ధి పనులకు ఇచ్చేస్తున్నారు. మరి ఇంకేంటి లోటు అనా? ఉంది.. అతిపెద్ద లోటు.. నియామకాలు.. అవును నియామకాల కోసం తెలంగాణ నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎంతసేపు కాళ్వేశ్వరం రైతులు, నిధుల యావలో పడి కేసీఆర్ కీలకమైన నిరుద్యోగులను గాలికొదిలేశారన్న ఆవేదన వారిలో నెలకొంది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేక మూడు నాలుగేళ్లవుతోంది. జోన్ల సిస్టం అంటూ కేంద్రానికి పంపి రెండు మూడేళ్లు గడుస్తోంది. దానిపై కోర్టు కేసులు.. ఇలా ఉద్యోగ ఖాళీల భర్తికి ఎన్నో సమస్యలున్నాయి. అభ్యంతరాలపై చాలామంది కోర్టుకెక్కారు. వాటన్నింటిని కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలున్నాయి..

*ఆ ఒక్క ముచ్చటా తీరిస్తే కేసీఆర్ కు ఎదురులేదు..
అన్నింటిని సెట్ రైట్ చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ నిరుద్యోగులు, యువతకు ఏం గిఫ్ట్ ఇవ్వకపోవడమే ఇప్పుడు వారిని నిరాశకు గురిచేస్తోంది. అందరికీ గిఫ్ట్ లు ఇస్తున్న కేసీఆర్.. ఉద్యోగాలు లేక అలమటిస్తున్న లక్షలమంది నిరుద్యోగులను.. వారి గోసను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. అన్నీ అయిపోయాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే ఇక తెలంగాణలో కేసీఆర్ కు ఎదురుండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆరేళ్లలో తెలంగాణ దశ మారింది.. దిశమారింది.. దరిద్రంపోయింది. తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. రైతన్నలు ఆనందంలో ఉన్నారు. అభివృద్ధితో పారిశ్రామిక పరుగులెత్తింది. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావడానికి సిద్దమైంది. తలాపున గోదారి.. హైదరాబాద్ వరకూ వస్తోంది. నీళ్లు వచ్చాయి.. నిధులు వచ్చాయి.. ఒక్క నియామకాలే మిగిలాయి. నిరుద్యోగుల ఆకలితీరిస్తే .. తెలంగాణలో ఇక అర్రులుచాచే వారుండరు. మరి ఆ దిశగా ఉద్యమ సేనాని ఆలోచిస్తారని ఆశిద్ధాం..

–నరేశ్ ఎన్నం