
ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్ల వరస రాజీనామాలు తెలంగాణలో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు రాజీనామా చేయగా తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?
నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను చూసి మనస్థాపంతో ఇటీవల రాజీనామా చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం అంత సీరియస్ గా తెలుసుకోలేదనే ఆరోపణలున్నాయి. అయితే మరోసారి ఇలాంటి సంఘటనలో వరంగల్ ఎంజీఎంలో వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరిండెంటెంట్ బత్తుల శ్రీనివాసరావు తన ఆరోగ్యం సహకరించడం లేదని కారణంతో తన పదవీకి రాజీనామా చేస్తున్నట్లు డీఎంఈకి లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదించాలని లేఖలో పేర్కొన్నాడు. అయితే ఆయన రాజీనామా వెనుక వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఆయన రాజీనామా వెనుక చాలా కారణాలున్నట్లు ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి ఆరోపణలు, కిందిస్థాయి ఉద్యోగులు సహకరించడం పోవడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సూపరింటెండెంట్ ను నియమించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సూపరిండెంటెండ్ పరిశీలనలో డాక్టర్ చంద్రశేఖర్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?
ఇక సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాలో 152 కరోనా కేసులు, రూరల్ జిల్లాలో 25, జనగామలో 18, భూపాలపల్లిలో 20, మహబూబాబాద్ జిల్లాలో 14కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.