Vangaveeti Radha Krishna: వంగవీటి ధైర్యం చేయలేదా?

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో రాధా డీలా పడ్డారు. ఆయన తిరిగి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ టిడిపిలోనే కొనసాగారు. అయితే సరైన సమయంలో రాంగ్ స్టెప్స్ వేయడంతోనే రాజకీయంగా ఇబ్బంది పడుతూ వచ్చారు.

Written By: Dharma, Updated On : February 29, 2024 6:12 pm
Follow us on

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఏంటి? ఆయన ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ రాధా అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ప్రకటించలేదు. ఇప్పటికే విజయవాడ నగరంలో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. పశ్చిమ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీలో రాధాకు చాన్స్ లేదని తేలిపోయింది. అటు వైసిపి సైతం విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అక్కడ కూడా నో ఛాన్స్. ఇప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ జనసేన. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ ఉన్నారు. జనసేనలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఆయనకి టికెట్ ఖరారు అని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది అన్న బలమైన చర్చ నడుస్తోంది. దివంగత వంగవీటి మోహన్ రంగ వారసుడిగా 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అక్కడకు నాలుగేళ్ల తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి రాధా ఎంట్రీ ఇచ్చారు. 2009లో పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.అయినా సరే వైసిపి ఆయనను విజయవాడ నగర బాధ్యతలను అప్పగించింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2019 ఎన్నికల్లో మాత్రం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. విజయవాడ సెంట్రల్ స్థానం బదులు మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఇచ్చేందుకు ప్రయత్నించినా రాధా వినలేదు. టిడిపిలో చేరిపోయారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో రాధా డీలా పడ్డారు. ఆయన తిరిగి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ టిడిపిలోనే కొనసాగారు. అయితే సరైన సమయంలో రాంగ్ స్టెప్స్ వేయడంతోనే రాజకీయంగా ఇబ్బంది పడుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కానీ విజయవాడ తూర్పును గద్దె రామ్మోహన్ రావుకు, విజయవాడ సెంట్రల్ ను బోండా ఉమా కు కేటాయించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయించనున్నారు. ఈ తరుణంలో రాధా పరిస్థితి ఏమిటి అన్నది తెలియడం లేదు. గతంలో గోదావరి జిల్లాల నుంచి రాధాను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. కానీ దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఏం చేయాలో రాధాకు పాలు పోవడం లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో రాధాకు వైసిపి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ సీటును కేటాయిస్తామని కొడాలి నాని ద్వారా ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికేపార్టీల మార్పు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రాధా చేతులు కాల్చుకున్నారు. 2004 తర్వాత చట్టసభలకు ఎంపిక కాలేకపోయారు. అందుకే వైసిపి ఇచ్చిన ఆఫర్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భయపడుతున్నారు. అయితే చావైనా రేవైనా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని అనుచరుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది. రాధాకు నారా లోకేష్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాధాకు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఏవో అవకాశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకే ఈ ఎన్నికల్లో రాధా టిడిపిలోనే కొనసాగుతారని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముంగిట ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.