Pawan Kalyan: జనసేన బిజెపి భాగస్వామ్య పక్షం. ఆ పార్టీతో కాకుండా జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమిలోకి బిజెపికి తెస్తానని పవన్ చెబుతున్నారు. పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ బిజెపి వచ్చింది లేదు. కూటమిలో చేరింది లేదు. పోనీ బిజెపి అగ్ర నాయకత్వం సానుకూల ప్రకటనలు కూడా చేయడం లేదు. రాష్ట్ర నాయకత్వం సైతం సైలెంట్ గా ఉంది. ఈ తరుణంలో బిజెపి పాత్ర ఏమిటి అన్నది తెలియడం లేదు. కూటమిలోకి వస్తుందా? లేకుంటే ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.
నెల రోజుల కిందట పవన్ బిజెపి అగ్ర నేతలను కలిశారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని… బిజెపి తప్పకుండా కూటమిలోకి వస్తుందని ప్రకటించారు. మరోసారి ఢిల్లీ వెళ్లి చర్చలు జరపనున్నట్లు కూడా పవన్ చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు జాతీయ నాయకుల అపాయింట్మెంట్ పవన్ కు లభించలేదు. ఏపీకి వస్తున్న జాతీయ నాయకులకు కూడా పవన్ ను కలవడం లేదు. కనీసం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం పవన్ ను సంప్రదించడం లేదు. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. అసలు బిజెపికి కూటమిలోకి వచ్చే ఆలోచన ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ పై బిజెపి అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన పవన్ సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. బిజెపి అగ్ర నేతలు తనపై తిట్ల దండకాన్ని సైతం ప్రయోగించారని ఓ సభలో చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపికి పవన్ స్నేహ హస్తం అందించారు. వైసిపి ప్రభుత్వం పై ఉమ్మడిగా ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. కానీ ఆ రెండు పార్టీల మధ్య ఆ తరహా ప్రయత్నాలు ఏవి జరగలేదు. ముఖ్యంగా బీజేపీని ఎదగనివ్వకుండా పవన్ చేశారని అగ్రనేతలు అనుమానిస్తున్నారు. ఇప్పుడు కూడా టిడిపి ప్రయోజనాల కోసమే పవన్ పాకులాడుతున్నారన్నది ఢిల్లీ వర్గాల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే పొత్తుకు ముందుకు వచ్చారని.. అందుకే పవన్ ను ఇప్పుడు పట్టించుకోవడం మానేశారని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి చంద్రబాబు తో ఢిల్లీ వెళ్లి పవన్ బిజెపి అగ్ర నేతలను కలుస్తారని రెండు వారాల కిందట ప్రచారం జరిగింది. కానీ రోజులు గడుస్తున్నాయే తప్ప అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కనీసం బిజెపి నుంచి స్పందన లేదు. దీంతో బిజెపి వేరే ఆలోచనతో ఉన్నట్లు విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. కనీసం పవన్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం పై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు బిజెపి లేకుండా అభ్యర్థుల ప్రకటనపై కూడా ఢిల్లీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం బిజెపి అగ్ర నేతలకు సమాచారం ఇచ్చి తాము అభ్యర్థులను ప్రకటించామని చెప్పుకొస్తున్నారు. ఏపీలో బిజెపిని ఎదగనివ్వకుండా చూడడంలో చంద్రబాబుది తొలి పాత్ర అయితే.. పవన్ ది రెండో పాత్ర అని బిజెపి అగ్ర నేతలు అనుమానంతో ఉన్నారు. అందుకే పవన్ వస్తానన్నా వారు సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. ఎన్నికల ముంగిట ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్ని జరుగుతాయో చూడాలి.