కొద్ది రోజుల క్రితమే అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన బైడెన్.. తన పనిని మొదలుపెట్టేశారు. మొదటి సారి ఆయన హయాంలో సిరియాపై విరుచుకుపడ్డారు. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అమెరికా మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే దాడులకు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇరాన్ మద్దతుతో పెట్రేగిపోతున్న ఉగ్రవాదులు తూర్పు సిరియాలో ఉన్నారనే సమాచారంతో గురువారం అమెరికా ఈ దాడులు చేసింది.
Also Read: తమిళులకు తాయిలాల మీద తాయిలాలు: పళని స్వామి మళ్లీ గెలిచేనా..?
సిరియా–-ఇరాక్ సరిహద్దుల్లోని ఇరాన్ మిలీషియా బృందాలే లక్ష్యంగా అగ్రరాజ్యం సైన్యాలు ఈ దాడులు చేశాయి. వైమానిక దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమైనట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడులను ఖచ్చితంగా ఏ ప్రాంతంలో చేశారనేది స్పష్టం చేయలేదు. కానీ.. ఇరాక్‌లోని అమెరికా, సంకీర్ణ దళాలపై ఇరాన్ మద్దతుతో రాకెట్ దాడులు చేసిన సిరియా మిలిటెంట్లపై ప్రతీకారంగా ఈ దాడులు చేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. ఈ నెల 15న ఉత్తర ఇరాక్‌లో సంకీర్ణ సైన్యాలే లక్ష్యంగా జరిగిన రాకెట్ దాడుల్లో ఓ కాంట్రాక్టర్ మృతిచెందాడు. యూఎస్‌కు చెందిన అధికారి, సంకీర్ణ దళాల సభ్యులు గాయపడ్డారు.
ఇరాన్ మద్దతిచ్చే ఉగ్రవాద బృందాలకు చెందిన పలు స్థావరాలు వైమానిక దాడుల్లో ధ్వంసమైనట్టు పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. అమెరికన్లు, భాగస్వామ్య పక్షాల రక్షణ విషయంలో ఎలాంటి చర్యలకైనా బైడెన్ వెనకాడబోరనే సందేశం ఈ దాడుల ద్వారా తెలిసిందని కిర్బీ పేర్కొన్నారు. అంతేకాదు.. ఇరాక్, తూర్పు సిరియాలో ఉద్రిక్తతలను జాగ్రత్తగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
Also Read: మార్పు మొదలైందంటున్న పవన్.. సంతోషానికి కారణమేంటి?
మరోవైపు, అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ ఇరాన్‌ను హెచ్చరించారు. ‘శిక్ష పడుతుందనే భయం లేనట్లు మీరు నటిస్తున్న విషయం మాకు తెలుసు. కానీ, జాగ్రత’ అని బైడెన్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. ఇదిలా ఉండగా.. అమెరికా వైమానిక దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. సిరియా గడ్డపై జియోనిస్ట్ పాలన కొనసాగుతోందని, అక్రమంగా ఆ భూభాగంలోకి తిష్టవేసిన అమెరికా దళాలు.. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాయని ఆరోపించింది. యూఎన్ చార్ట్ సహా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 నిబంధనల ప్రకారం సిరియాపై వైమానిక దాడులు చేసినట్టు అమెరికా ప్రకటించింది. రాజ్యాంగం, యూఎన్ చార్టర్‌లో పొందుపరిచిన స్వాభావిక ఆత్మరక్షణ అధికారాలకు అనుగుణంగా అధ్యక్షుడు వ్యవహరించారు అని ఎన్ఎస్సీ అధికార ప్రతినిధి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు