Undavalli Sridevi: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్ ఇచ్చి టీడీపీ అభ్యర్థికి ఓటు వేసిన ఎమ్మెల్యే శ్రీదేవి మొదటి నుంచి ఇరకాటమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. తాజాగా వైసీపీ నుంచి వైసీపీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో రాజకీయ భవితవ్యం ఏమవుతుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. తాజా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఉద్దేశంతో వైసిపి ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే, ఆమె 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు సానుకూలంగా ఏమీ లేవు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్నాళ్ల నుంచే సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు మొదలయ్యాయి. సొంత పార్టీ ఎంపీ నియోజకవర్గంలో జోక్యంపై ఉండవల్లి శ్రీదేవి అభ్యంతరం చెప్పడంతో మొదలైన వివాదం పెద్దదిగా మారింది. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తనపై లేనిపోని అపవాదులు వేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి అప్పట్లో అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇదే సమయంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండకు అదనపు సమన్వయకర్త పేరుతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది. దీంతో ఒకే నియోజకవర్గంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడి కార్యకర్తలు నేతల్లో, గ్రూపులు మొదలయ్యాయి.
పరస్పర ఆరోపణలతో ఇరువర్గాలు..
రెండు అధికార కేంద్రాలు నియోజకవర్గంలో ఉండడంతో కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారు చేసుకోవడం, ఒక వర్గంపై మరో వర్గం ఆరోపణలు చేయడంతో ఉండవల్లి శ్రీదేవి సొంత పార్టీలోనే ఇరకాటానికి గురయ్యారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఏం చేయాలన్న అడ్డంకులు ఏర్పడ్డాయి. నామినేటెడ్ పదవులు విషయంలోనూ వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొన్ని పదవులకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సమన్వయకర్తలు ఒత్తిడితో తిరిగి ఉపసంహరించుకున్న సందర్భాలు ఉన్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ కు గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించిన తర్వాత తాడికొండ నియోజకవర్గానికి కత్తెర సురేష్ ను అదనపు సమన్వయకర్తగా నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ప్రాధాన్యత మరింత తగ్గింది. దీంతో ఆమెలో అసహనం మరింత పెరిగినట్టు అయింది.
ఎమ్మెల్యేకు ఎక్కడకక్కడ అడ్డంకులు..
నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి వర్గానికి ఎక్కడకక్కడ అడ్డంకులు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి సీటు ఇవ్వరన్న ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా ఆమె అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు సైతం నియోజకవర్గంలో కత్తెర సురేష్ ఆధ్వర్యంలో జరుగుతుండడంతో ఉండవల్లి శ్రీదేవి వర్గానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓటింగ్ లో పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థికి 23 ఓట్లు వచ్చి విజయం సాధించడంతో వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని ఆమెను బహిష్కరించినట్లు ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
పార్టీ చెప్పిన అభ్యర్థికే ఓటు..
పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ముందు ఆమె పలు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ సూచించిన అభ్యర్థికే ఓటు వేశానని స్పష్టం చేశారు. అవసరంగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె చెప్పిన మాటలను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో బహిష్కరణ వేటు వేసినట్లు చెబుతున్నారు.
భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి..?
2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవిని.. పార్టీ నుంచి బహిష్కరించడంతో భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. బహిష్కరణ తర్వాత ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై స్పందించిన తర్వాత రాజకీయంగా తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.